సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, రాశీఖన్నా నటీనటులుగా మారుతీ తెరకెక్కించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరించడంతో హిట్ లిస్ట్‌లో చేరిపోయింది. అంతేకాదు.. తేజ్ కెరియర్‌లో బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిందని చెప్పుకోవచ్చు. మారుతీ-తేజ్ కాంబోలో సినిమా సూపర్ డూపర్ హిట్టవ్వడంతో ఇదే ఊపు మీద మరో సినిమా తెరకెక్కించేయాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఒకట్రెండు సార్లు చెప్పారు. అయితే ఫలానా సినిమా చేస్తున్నామని డైరెక్టుగా గాకుండా పరోక్షంగా చెప్పుకొచ్చారు. అదీ కూడా రీమేక్ సినిమా చేద్దామనకోవడం విశేషమే.
సాయితేజ్-మారుతీ ఇప్పటికే ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొని సినిమాకు సంబంధించిన.. వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. అయితే తదుపరి ఏ చిత్రం చేయాలనుంది..? రీమేక్ లేదా ఒరిజినల్ అని అడగ్గా.. మొదట సాయితేజ్ సరసన చిరంజీవిగారి ‘చంటాబ్బాయి’ అని చెప్పాడు. మరోవైపు మారుతీ కూడా ‘చంటబ్బాయి’ అని చెప్పడం విశేషం. అంటే ఇద్దరి నోటా ఒకటే వచ్చిందంటే.. ఆల్రెడీ వీళ్లిద్దరూ ఓ మాట అనుకోవడం అయిపోయిందని స్పష్టం అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే.. తాజాగా సాయితేజ్.. ట్విట్టర్‌లో ఆస్క్ సాయితేజ్ పేరిట ప్రేక్షకులతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా వీరాభిమానులు, మెగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చాడు. రీమేక్ గురించి అడగ్గా.. ‘నేను రీమేక్‌లు చేయను.. కానీ ఒకవేళ నాకంటూ ఒక చాయిస్ ఇస్తే ‘చంటబ్బాయి’ ఎంపిక చేసుకుంటాను’ అని మనసులో మాట చెప్పాడు. అయితే ఇలా పదే పదే చెప్పడం మరోవైపు మారుతీ కూడా ఇదే మాట చెప్పడంతో ఈ ఇద్దరి కాంబోలో కచ్చితంగా రీమేక్ సినిమా ఉంటుందని తెలిసిపోయింది. కాగా.. జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా 1986లో ‘చంటబ్బాయి’ వచ్చింది. అప్పట్లో ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పటికీ టీవీల్లో సినిమా వస్తే అస్సలు వదిలిపెట్టరు.. అదీ ఈ సినిమా రేంజ్ అందుకే సాయితేజ్ ఇష్టపడ్డాడు. మరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే.