అవును.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. లేడీ అమితాబ్ విజయశాంతి అలియాస్ రాములమ్మ.. నిజంగా వీరిద్దరికీ ‘సరిలేరు ఎవ్వరూ..’.!. ఇద్దరూ ఇద్దరే. ఒకరికొకరు ఏ మాత్రం తీసిపోరు.. చిరు హీరోగా రాణిస్తే.. రాములమ్మ మాత్రం మెగాస్టార్ హీరోయిన్‌గా నిలిచిపోయింది. అప్పటికీ ఇప్పటికీ వీరిద్దరూ నటించిన సినిమాలు ఎవర్ గ్రీనే..!. ఒకట్రెండు కాదు సుమారు 20 ఏళ్ల తర్వాత వీరిద్దరూ ఒకే స్టేజ్‌పై కనిపించారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వీరిద్దర్నీ కలిపింది. వాస్తవానికి వీళ్లిద్దరూ వచ్చింది ఈ ఈవెంట్‌కు అయితే.. ఈ సందర్భంగా పాతరోజులు, పాత సినిమాలు, అప్పట్లో జరిగిన కొన్ని కొన్ని ఆసక్తికర విషయాలు.. మరీ ముఖ్యంగా సినిమాలతో పాటు రాజకీయాలను ప్రస్తావనకు తెస్తూ చిరు ఔరా అనిపించగా.. విజయశాంతి మాత్రం రప్ఫాడించేశారు.
చిరుకు స్వీట్ వార్నింగ్!
ఇలా వీరిద్దరి మాటలతో సభికులు, ఈవెంట్‌కు వచ్చిన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. చిరు మాట్లాడటం.. విజయశాంతి రిప్లై ఇవ్వడం.. ఇలా సుమారు అరగంటపాటు వీరిద్దరి మధ్యే సంభాషణ జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈవెంట్ మొత్తానికి చిరు-రాములమ్మే హైలైట్‌గా నిలిచారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇవన్నీ ఒక ఎత్తయితే రాజకీయంగా రాములమ్మ తనను తిట్టిన మాటలను గుర్తుకు తెచ్చుకున్న చిరు.. ‘నాకంటే ముందు రాజకీయాల్లోకి వెళ్లావు కదా.. నన్ను అన్నెన్ని మాటలు అనాలని నీకెందుకు అనిపించింది? శాంతి’ అని చిరు అనగా.. విజయశాంతి స్పందిస్తూ.. ‘చేయి చూశావ్‌గా ఎంత రఫ్‌గా ఉందో రఫ్పాడించేస్తా జాగ్రత్త’ అని నవ్వుతూ రాములమ్మ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘రాజకీయాలు వేరు, సినిమాలు వేరు.. ఎప్పటికీ మీరు నా హీరో, నేను మీ హీరోయిన్ అంతే’ అని విజయశాంతి భావోద్వేగానికి లోనయ్యారు. మొత్తానికి చూస్తే.. అటు చిరు.. ఇటు విజయశాంతి వీరి మాటలకు ఫ్యాన్స్ అంతా ‘సరిలేరు మీకెవ్వరూ..’ అని అనుకున్నారట.