టైటిల్ చూడగానే.. ఇదేంట్రా బాబూ.. నిన్నగాక మొన్నేగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో సూపర్‌స్టార్ మహేశ్ బాబు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ పోటాపోటీగా రిలీజ్ అయ్యాయ్.. రెండూ గట్టిగానే ఢీ కొట్టుకుంటూ కలెక్షన్ల వర్షం కురిపించుకుంటున్నాయ్.. మళ్లీ ఇంకో హీరో ఢీ కొట్టేదేంటి..? అని అనుకుంటున్నారా.. ఎస్ బన్నీను హీరో ఢీ కొడుతున్నాడు.. కానీ మీరనుకున్నట్లుగా ‘సినిమాతో’ కాదండోయ్.. ‘సినిమాలో’.. విలన్‌గా ఢీ కొడుతున్నాడు. ఇంతకీ ఆ టాప్ హీరో ఎవరు..? బన్నీని ఏ సినిమాలో ఢీ కొట్టబోతున్నాడనే వివరాలు ఈ కథనంలో చూద్దాం.
‘అల వైకుంఠపురములో’ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకోవడంతో పాటు.. కలెక్షన్ల పరంగా కూడా బాగానే దూసుకెళ్తోంది. ఆశించిన, ఊహించిన దానికంటే సినిమా బాగానే మొదటి రోజే సక్సెస్ అయ్యింది. అయితే మంచి ఊపు మీదున్న బన్నీ.. ఇక ఆలస్యం చేయకుండా ఇదివరకటిలా గ్యాప్ మళ్లీ మళ్లీ తీసుకోకూడదని భావించి సుకుమార్‌తో సిద్ధమైపోయాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి బన్నీతో అవసరంలేని షాట్స్‌ను చిత్రీకరించడం జరిగింది. అయితే సినిమాలో బన్నీ ఢీ కొట్టేదెవరు..? మళ్లీ బన్నీ బావ నవదీప్‌నే తీసుకోవాలని మొదట భావించినప్పటికీ ఇప్పటికే ఆయన సినిమాల్లో చేశాడుగా.. మళ్లీ అంటే చూసే ప్రేక్షకులకు అంతబాగా అనిపించదని భావించి ఫైనల్‌గా టాప్ హీరోను చిత్రబృందం ఫిక్స్ చేసింది.
ఆ టాప్ హీరో మరెవరో కాదండోయ్.. ఓ వైపు సినిమాలతో హీరోగా.. మరోవైపు విలన్ పాత్రల్లో బిజిబిజీగా ఉండే నటుడు విజయ్ సేతుపతి. ఆయన్ను తమ సినిమాలో విలన్‌గా తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమా మొత్తం ఎర్రచందనం చుట్టూ తిరుగుతుందని ఇప్పటికే లీకులు వచ్చాయ్. కాగా.. పేరు మాత్రం ఇంకా ఫిక్స్ చేయలేదు కానీ షూటింగ్ మాత్రం షురూ చేసేశారు.