జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సూపర్ హిట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన దిల్ రాజు మూవీ ‘పింక్’ రీమేక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ఈ షూటింగ్ తాలుకు ఫొటోలు కూడా నెట్టింట్లో దర్శనమిచ్చి.. వైరల్ అవుతున్నాయ్. అయితే ఇది పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త కాగా.. తాజా వార్త అభిమానులకు డబుల్ ధమాకా అని చెప్పుకోవచ్చు. ఇంతకీ ఆ విశేషమేంటో www.cinejosh.com ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
షూటింగ్ షురూ..!
‘పింక్’ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా ఉంటుందని గత కొన్నిరోజులుగా పుకార్లు షికార్లు చేసిన విషయం విదితమే. అయితే అది నిజమేనని తాజాగా తేలిపోయింది. బుధవారం నాడు క్రిష్-పవన్ కాంబోలో సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో ఉన్న రామానాయుడు స్టూడియోలో బుధవారం నాడు షూటింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కాగా.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న పవన్ సినిమాను ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నారని తెలుస్తోంది.
‘సైరా’కు మించిన సినిమా..!
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీ కోసం భారీ సెట్స్ వేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘పింక్’ షూటింగ్‌లో పవన్ ఫిబ్రవరి 4 నుంచి క్రిష్ తెరకెక్కిస్తున్న మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ సినిమా పీరియాడికల్ డ్రామాగా ఉంటుందని సమాచారం. మరీ ముఖ్యంగా ఈ మూవీ కోసం ఎ.ఎం.రత్నం భారీ బడ్జెట్ వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’కు మించిన చిత్రం అని కూడా వార్తలు వస్తున్నాయ్. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చినంత వరకు వేచి చూడాల్సిందే.