వరుస పరాజయాలతో సతమతమవుతున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ తన కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఉయ్యాలా జంపాలా సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన ఈ హీరో ఆ తర్వాత వచ్చిన కుమారి 21 ఎఫ్ సినిమాతో మంచి విజయం దక్కించుకున్నాడు. అయితే గత కొంత కాలంగా ఈ హీరోకి విజయం అందని ద్రాక్షే అయింది. కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత అతడు చేసిన ఏ సినిమా కూడా బాక్సాఫీసు విజయం సాధించలేదు.
మొన్నటికి మొన్న వచ్చిన "ఇద్దరి లోకం ఒకటే" చిత్రం కూడా పరాజయం పాలైంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం కూడా పరాజయం కావడంతో అతని మార్కెట్ పూర్తిగా దెబ్బతింది. దీంతో రాజ్ తరుణ్ తీవ్ర నిరాశకి గురయ్యాడు. అయితే ప్రస్తుతం మళ్లీ అతడు ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా మాళవిక హీరోయిన్ గా రొమాంటిక్ చిత్రాల దర్శకుడు కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో "ఒరేయ్ బుజ్జిగా" పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ చిత్ర షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసి ఈ సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఒరేయ్ బుజ్జిగా చిత్రంలో రాజ్ తరుణ్ కి జోడీగా మాళవికా నాయర్ నటిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయని సమాచారం. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ గా హెబ్బా పటేల్ కూడా కనిపించనుంది. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ జంటగా నటించిన కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మరి ఈ సారి కూడా ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి రాజ్ తరుణ్ కి హిట్ పడుతుందో లేదో చూడాలి.