యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉన్న ‘అశ్వథ్థామ’ తప్పకుండా విజయం సాధిస్తుంది - దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు.
యంగ్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై రమణ తేజ దర్శకత్వంలో ఉష ముల్పూరి నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘అశ్వథ్థామ’. మెహరీన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నసందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి పాల్గొన్నారు.
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ‘‘నేను చిన్న సినిమాలు చూస్తుంటాను. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న దర్శకులు, సాంకేతిక నిపుణులు మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. నటుడిగా నాగశౌర్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. గడ్డం తీస్తే క్లాస్‌గా కనిపిస్తాడు. గడ్డం ఉంటే ఫైటర్‌గా ఉంటాడు. కిరీటం పెడితే కృష్ణుడిలా, క్యాప్ పెడితే కౌబాయ్‌లా ఉంటాడు. ‘ఊహలు గుసగుసలాడే’, ‘ఛలో’ వంటి సినిమాలు సక్సెస్ సమయంలో నా కన్ను నాగశౌర్యపై పడింది. దేవి కటాక్షం కోసం చూస్తున్నాం నేను ‘అశ్వథ్థామ’ చిత్రం చూడలేదు. కానీ ఈ చిత్రం నా ఊహకు ఓ కమర్షియల్ కుంటుంబ కథా చిత్రంగా అనిపిస్తుంది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం హిట్ సాధిస్తుంది. ‘అశ్వథ్థామ’ చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్. నాగశౌర్య తన కెరీర్‌లో ఇంకా ఎన్నో విజయాలు అందుకోవాలి’’ అన్నారు.
యంగ్ హీరో నాగశౌర్య మాట్లాడుతూ - ‘‘రాఘవేంద్రరావుగారి ఆశీస్సులతో ఈ సినిమా మొదలైంది. ఆయన చేయి చాలా మంచిదని అంటుంటారు. మా సినిమా ప్రొడక్ట్ బాగా వచ్చింది. దాదాపు నెలరోజుల నుంచి ఈ సినిమా గురించి మాట్లాడుతూనే ఉన్నాను. శుక్రవారం మా సినిమా విడుదల అవుతుంది. అప్పుడు ప్రేక్షకుల అభిప్రాయాలను నా చెవులతో వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ చిత్రం నాకొక మంచి ఎమోషన్ జర్నీ అని చెప్పగలను. ఇందులో కొత్త శౌర్యను చూస్తారు. నేను కన్న ఈ సినిమా దీని కోసం మా టీమ్ అంత చాలా కష్టపడ్డారు. నాకు కథ చెప్పి దర్శకుడు అవుదామని వచ్చిన ఫణి నా మాట విని ఈ సినిమాకు అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా చరణ్‌తేజ్ అందించిన సంగీతం శ్రోతలకు కనెక్ట్ అయింది. జిబ్రాన్ మంచి నేపథ్యసంగీతం సమకూర్చారు. ఇంకా ఎడిటర్ గ్యారీ, కెమెరామన్ మనోజ్ డైలాగ్ రైటర్స్ సురేష్, భాస్కర్ ఇలా అందరు బాగా కష్టపడ్డారు. కష్టపడి సినిమాను నిజాయితీగా తీశాం. ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు.
చిత్ర దర్శకుడు రమణతేజ మాట్లాడుతూ - ‘‘ఇక్కడికి వచ్చిన రాఘవేంద్రరావు గారికి ధన్యవాదాలు. మూవీ ఓపెనింగ్ రోజు ఆయన వచ్చారు. ఇప్పుడు రిలీజ్ సందర్భంగా మళ్లీ మాకు సపోర్ట్‌గా వచ్చారు. ఈ సినిమాను రమణతేజ బాగా తీశాడని చెప్పుకుంటున్నారు. కానీ నాగశౌర్య మంచి కథను అందించారు. నాగశౌర్య సపోర్ట్ మరవలేనిది. ఇక ఈ సినిమా రిజల్ట్
గురించి పక్కన పెడితే.. ఓ మంచి కారణంతో తీశాం. ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు.
ఐరా క్రియేషన్స్ డిజిటల్ డైరెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ - ‘‘మా తమ్ముడు ఇప్పటివరకు 17 సినిమాలు చేశాడు. ఇది 18వ
సినిమా. ప్రతి సినిమాకు నేను ఎదొఒక కంప్లైట్ చేసేవాడిని. ఈ సినిమాకు అలా ఏం లేదు. తనలోని యాక్టర్‌కి పోటీ పడేలా రైటర్, తనలోని రైటర్‌కు పోటీగా యాక్టర్ అంటూ చేశాడు శౌర్య. రమణతేజ ఈ సినిమాను బాగా తీశారు. డిజిటల్ పబ్లిసిటీ క్రెడిట్ నా ఒక్కడిదే కాదు. టీమ్ అందరిదీ. సహకరిస్తున్న మీడియాకు ధన్యవాదాలు’’ అన్నారు.
నటుడు కాశీవిశ్వనాథ్ మాట్లాడుతూ - ‘‘సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలను ఎదిరించే వ్యక్తిత్వం ఉన్నవాడు ‘అశ్వథ్థామ’. ఈ చిత్రం ఐరా క్రియేషన్స్‌లో మంచి చిత్రంగా నిలుస్తుంది. ఒకప్పుడు భాగ్యరాజ్, రాజేంద్రన్ వంటివారు వారే
కథ రాసుకుని హీరోగా రాసేవారు. ఈ సినిమాకు నాగశౌర్య అలా చేశారు’’ అన్నారు.
ఈ కార్యక్రమంలో కెమెరామెన్ మనోజ్, ఎడిటర్ గ్యారీ, డైలాగ్ రైటర్ పరశురామ్, కో డైరెక్టర్ అంకిత్, శ్రీనివాసరెడ్డి ప్రసంగించి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
నాగశౌర్య, మెహరీన్ హీరోహీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: జిబ్రాన్, ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్, డిజిటల్: ఎం.ఎస్.ఎస్. గౌతమ్, డైలాగ్స్: పరుశురాం శ్రీనివాస్, యాక్షన్: అన్బరివు, కొరియోగ్రఫీ: విశ్వ రఘు, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి, నిర్మాత: ఉషా ముల్పూరి, కథ: నాగశౌర్య, కో డైరెక్టర్ అంకిత్, శ్రీనివాసరెడ్డి, దర్శకత్వం: రమణ తేజ.