కొన్ని సినిమాల టైటిల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి. అవి ఎందుకు పెట్టారన్నది ఒక పట్టాన అర్థం కావు. ఆ సినిమా పేరు వెనక ఉన్న మతలబు ఏంటనేది చెప్తే తప్ప ఎవ్వరికీ అర్థం కాకుండా ఉంటాయి. ఫలక్ నుమా దాస్ తో మంచి హిట్ అందుకున్న విశ్వక్ సేన్ హిట్ అనే పేరుతో మన ముందుకు వస్తున్నాడు. హీరో నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటివల ఈ చిత్ర టీజర్ ని వదిలారు. పోలీస్ ఆఫీసరుగా విశ్వక్ సేన్ ఎదో మిస్టరీని చేధించే క్రమంలో ఏమేం చేసాడన్నదే సినిమా కథగా ఉందని అనిపిస్తుంది. టీజర్ ఆద్యంతం ఆసక్తిగా థ్రిల్లింగ్ అంశాలతో ఉండడంతో అందరి దృష్టి దీని మీద పడింది. ఆ ఆసక్తితోనే హిట్ అనే టైటిల్ కి అర్థం ఏంటని వెతుకుతున్నారు. సినిమా రిలీజ్ అవకముందే హిట్ అన్న టైటిల్ పెట్టుకున్నారంటే వాళ్ళకి అంత నమ్మకముందా అని అనుకున్నవాళ్ళు ఉన్నారు.
తాజాగా ఈ టైటిల్ కి సంబంధించిన అర్థాన్ని ఒక చిన్న వీడియో ద్వారా రివీల్ చేసారు. ఆ విడియోలో విశ్వక్ సేన్ ఒక మిస్సింగ్ కేసుకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కేసు విషయాలు హెచ్ ఐ టీ విభాగంలో పోస్ట్ చేస్తామని చెబుతూ కనిపించాడు. ఇంతకీ హెచ్ఐటీ అంటే ఏంటని విలేకరులు అడిగితే.. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీం అని చెబుతాడు హీరో. మొత్తానికి ఈ సినిమాకు హిట్ అనే టైటిల్ పెట్టడం వెనుక అసలు కథ ఇదన్నమాట.