సమంత, శర్వానంద్ ప్రదాన పాత్రలు పోషించిన ‘జాను’ సినిమా ఫిబ్రవరి 7న విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ డిజప్పాయింట్ చేసిందనే వార్త అభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ విశ్లేషకులు ఆ సినిమాని ఫ్లాప్ అని స్పష్టం చేస్తున్నారు. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి నటించగా ఘన విజయం సాధించిన ‘96’ మూవీకి ‘జాను’ రీమేక్. ఒరిజినల్‌ను రూపొందించిన ప్రేమ్ కుమార్ ఈ మూవీనీ డైరెక్ట్ చేశాడు. తమిళ వెర్షన్ కంటే రిచ్‌గా ‘జాను’ను నిర్మించాడు దిల్ రాజు.
ఉదాహరణకు సినిమాలో శర్వానంద్ ఇంట్రడక్షన్ సీన్స్‌ను కెన్యాలో బాగా ఖర్చుపెట్టి చిత్రీకరించారు. నిర్మాణ విలువల పరంగా దిల్ రాజు కాంప్రమైజ్ కాలేదు. డైరెక్టర్ ఏది అడిగితే అది సమకూర్చిపెట్టాడు. అయితే త్రిష క్యారెక్టర్‌కు తెలుగు వెర్షన్‌లో సమంత మ్యాచ్ అయ్యింది కానీ, విజయ్ సేతుపతి చేసిన రామచంద్ర పాత్రకు శర్వానంద్ సరిపోలేదనే టాక్ వచ్చింది. అప్పటికీ శర్వానంద్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినా ఆ క్యారెక్టర్‌కు అది సరిపోలేదంటున్నారు.
ఇక వసూళ్ల విషయానికి వస్తే, తొలివారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ‘జాను’ కేవలం రూ. 6.60 కోట్ల షేర్ మాత్రమే సాధించిందని సమాచారం. ఈ ఏరియాల్లో ఈ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ వాల్యూ రూ. 16 కోట్లు. అంటే తొలి వారం పూర్తయ్యేసరికి రికవర్ అయ్యింది 41 శాతమే. రెండో వారంలో ఈ సినిమా వసూళ్లు మరింతగా పడిపోతాయని అంచనా. దీన్నిబట్టి ‘జాను’ డిజాస్టర్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఎందుకిలా జరిగింది? రెండు వెర్షన్లు ఒక్కలాగే ఉన్నా ఎక్కడ తేడా కొట్టింది?
ఈ విషయంలో తమిళ ప్రేక్షకుల అభిరుచులు, తెలుగు ప్రేక్షకుల అభిరుచులు వేర్వేరుగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. తమిళ వెర్షన్‌ను ఒకట్రెండు చిన్న చిన్న మార్పులు తప్ప మక్కీకి మక్కీ దింపేశాడు డైరెక్టర్. హీరో హీరోయిన్లు సహా అన్ని పాత్రల పేర్లూ అవే పెట్టాడు. రెండు సినిమాల్లోనూ హీరోయిన్ సింగపూర్ నుంచే వస్తుంది. అన్ని సీన్లూ అవే. క్లైమాక్స్ కూడా సేమ్ టు సేమ్. మరైతే తెలుగు వెర్షన్ ఎందుకు ఫ్లాపయ్యింది? శర్వానంద్ క్యారెక్టర్ నచ్చకపోవడమేనని ఎక్కువమంది చెప్తున్న మాట. హీరో అంత పిరికివాడుగా, అంత సున్నితమనస్కుడిగా కనిపించడాన్ని మనవాళ్లు అంగీకరించలేకపోయారు. అదీ సంగతి!