రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రేమికుల రోజున వరల్డ్ ఫేమస్ లవర్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డియర్ కామ్రేడ్ వంటి డిజాస్టర్ మూవీ తర్వాత విజయ్ చేసిన చిత్రం కావడంతో అభిమానులు ఈ సినిమా మీద మంచి అంచనాలే పెట్టుకున్నారు. డియర్ కామ్రేడ్ తో నిరాశపర్చిన విజయ్ ఈ సినిమాతోనైనా మంచి హిట్ కొడతాడని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. డియర్ కామ్రేడ్ మాదిరిగానే ఈ సినిమా కూడా బాక్సాఫీసు వద్ద నెగెటివ్ టాక్ తెచ్చుకుంది.
ఆ నెగెటివ్ టాక్ చాలా స్పీడ్ గా స్ప్రెడ్ అవడంతో మొదటిరోజే ఈ సినిమాకి వసూళ్ళు తగ్గిపోయాయి. రిలీజ్ కి ముందు ఉండాల్సిన బజ్ కూడా ఎక్కువ లేకపోవడంతో ఓపెనింగ్స్ కూడా చాలా తక్కువ వచ్చాయని సమాచారం. అయితే విజయ్ ఈ రిజల్ట్ ని ముందే ఊహించాడట. అవును మీరు వింటున్నది నిజమే. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ఫ్లాప్ అవుతుందని విజయ్ ముందే ఊహించాడని అంటున్నారు.
సాధారణంగా ప్రమోషన్లలో విజయ్ చాలా దూకుడుగా ప్రవర్తిస్తాడు. వరల్డ్ ఫేమస్ లవర్ విషయంలో అలా జరగకపోవడానికి కారణం కూడా అదేనట. పెళ్ళి చూపులు సినిమా రిలీజ్ కాగానే విజయ్ సైన్ చేసిన చాలా సినిమాల్లో వరల్డ్ ఫేమస్ లవర్ కూడా ఒకటి. అప్పటికీ అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కాకపోవడంతో విజయ్ కి ఇంతటి పాపులారిటీ లేదు. అదీగాక వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి అర్జున్ రెడ్డితో చాలా పోలికలు ఉండడంతో సినిమా పోతుందని ముందే భావించాడని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో విజయ్ కే తెలియాలి.