అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుశాంత్ గత కొన్ని రోజులుగా వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. అటు హీరోగా సక్సెస్ అందుకోలేకపోతున్న సుశాంత్ మొదటిసారిగా అల వైకుంఠపురములో సినిమాలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించాడు. హీరోగా ఏడాదికో, రెండేళ్లకో ఒక్కో సినిమా చేస్తూ నెమ్మదిగా తన కెరీర్ ని మలుచుకుంటున్న సుశాంత్ సడెన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారడంతో అందరికీ అసక్తి మొదలైంది.
అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సినిమాలో సుశాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నాడంటే, ఆ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని భావించారు. కానీ సినిమా విడుదల అయ్యాక సుశాంత్ క్యారెక్టర్ చూసి అందరూ షాక్ అయ్యారు. సినిమాలో సుశాంత్ పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడమే కాక, ఎక్కువ సేపు కనిపించకపోవడం కూడా మైనస్ గా మారింది. ఐతే ఇదే విషయం ప్రస్తావిస్తే మాత్రం సుశాంత్.. ఆ సినిమా చేయడం పట్ల తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని తేల్చేశాడు.
ట్విట్టర్ లో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చిన సుశాంత్ ఈ విధంగా స్పందించాడు. అల వైకుంఠపురములో సినిమాలో నటించడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఆ సినిమా చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. స్క్రీన్ టైం విషయానికి వస్తే.. భారీ తారాగణం, ప్రతిభావంతులైన సాంకేతిక బృందంతో పని చేస్తున్నపుడు మనం టీం ప్లేయర్‌గానే ఉండాలి. ఈ సినిమాలో నా సన్నివేశాలు కొన్ని తగ్గించారు. సినిమాలో మిస్సయిన సన్నివేశాలు త్వరలో యూట్యూబ్‌లో రిలీజవుతాయి" అని చెప్పాడు సుశాంత్.