రీమేక్స్ సినిమాలు ఇప్పుడు టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయన్న సంగతి తెలిసిందే. కొత్తగా కథ రాయడమెందుకు ఆల్రెడీ అక్కడ హిట్టయిపోయిందిగా.. రీమేక్ చేసేస్తే పోలా అని డైరెక్టర్లు.. హీరోలు ఈ బాట పట్టేస్తున్నారు. మరీ ముఖ్యంగా దిల్ రాజు లాంటి బడా నిర్మాతలు రీమేక్‌లకే ప్రాధాన్యత ఇస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని సినిమాలను రీమేక్ చేసిన దిల్‌రాజు.. గ్రాండ్ సక్సెస్ అయ్యాడు.. మరికొన్ని సినిమాలు ఆశించినంతగా ఆడకపోవడంతో గట్టిగానే నష్టాలు కూడా వచ్చాయ్. వాటి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. ‘96’ సినిమా రీమేక్ ‘జాను’నే ఇందుకు చక్కటి ఉదాహరణ.
ఇప్పటికే ‘లూసిఫర్’!
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికొస్తే.. తనకు వేరే భాషల్లో హిట్టయిన సినిమా నచ్చితే చాలు.. రీమేక్ హక్కులను కొనేస్తున్నాడు. ఇప్పటికే మలయాళంలో సూపర్ డూపర్ హిట్టయిన ‘లూసిఫర్’ హక్కులను కొనేసిన సంగతి తెలిసిందే. మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ఈ ‘లూసిఫర్’ మూవీ భారీ విజయం దక్కించుకుంది. వివేక్ ఒబెరాయ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వాస్తవానికి కొరటాల శివ సినిమా కంటే ముందుగానే రీమేక్ చేయాలనుకున్నప్పటికీ కొన్ని అనివార్యకారణాల వల్ల అది వాయిదా పడింది. కొరటాల మూవీ తర్వాత పక్కాగా ఇది ఉంటుందని.. ఇప్పటికే డైరెక్టర్లను వెతికే పనిలో చెర్రీ బిజీగా ఉన్నాడు.
తాజాగా మరొకటి..!?
తాజాగా మరో మలయాళ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. మలయాళ స్టార్ హీరోల్లో ఒకరైన పృథ్విరాజ్ సుకుమారన్ ఈ హీరోగా వచ్చిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ మూవీ అక్కడ గట్టిగానే కలెక్షన్లు రాబట్టింది. రీమేక్ రైట్స్ కొనేశారు కానీ.. ఎవరు హీరోగా నటిస్తారు..? తనకోసమే కొన్నారా..? అనేది మాత్రం తెలియరాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మెగా హీరోల్లో ఎవరో ఒకరితో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివర్లో లేక వచ్చే ఏడాదిలో సినిమా ఉంటుందని సమాచారం.
ఎన్నెన్ని కొంటారో..!
కాగా.. ప్రస్తుతం చెర్రీ ‘RRR’ సినిమాలో నటిస్తుండగా.. త్వరలోనే కొరటాల-చిరు కాంబో సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు అయిపోయే సరికి ఈ ఏడాది పూర్తవుతుంది.. ఆ తర్వాత ‘లూసిఫర్’, ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమాలు ఉంటాయని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే. అయితే.. అభిమానులు, నెటిజన్లు మాత్రం ‘ఎన్ని రీమేక్స్ రైట్స్ కొంటారు చెర్రీ.. అన్నీ అవేనా.. జర కుర్ర, కొత్త డైరెక్టర్స్ అవకాశమిచ్చి చూడండి.. అదరగొట్టేస్తారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.