బుజ్జి బుడుగు ఫిలిమ్స్ పతాకంపై డాక్టర్ అరుణకుమారి నిర్మించిన చిత్రం ‘స్క్రీన్‌ప్లే’. ‘ఆఫ్ ఏన్ ఇండియన్ లవ్ స్టొరీ’ అన్నది ట్యాగ్ లైన్. పరిశ్రమ వర్గాల్లో ‘స్క్రిప్ట్ డాక్టర్’గా సుప్రసిద్ధులైన కె.ఎల్.ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఒక ముఖ్య పాత్ర కూడా పోషించడం విశేషం. విక్రమ్ శివ-ప్రగతి యాదాటి హీరోహీరోయిన్లు. ఎం.వి.రఘు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఎం.ఏ.శ్రీలేఖ సంగీతం సమకూర్చారు. రాజేష్ ఫణి ఎడిటర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్ర ట్రైలర్ ప్రసాద్స్ గ్రూప్స్ అధినేత రమేష్ ప్రసాద్ లాంచ్ చేశారు.
సుప్రసిద్ధ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్, ప్రఖ్యాత రచయిత విజయేంద్రప్రసాద్, జె.కె.భైరవి, ఆర్.నారాయణ మూర్తి, సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ, హీరో విక్రమ్ శివ, హీరోయిన్ ప్రగతి యాదాటి, నిర్మాత డాక్టర్ అరుణకుమారి, నటుడు-దర్శకుడు కె.ఎల్.ప్రసాద్ పాల్గొన్నారు.
కె.ఎల్.ప్రసాద్ తెలుగు సినిమాకు దొరికిన వజ్రమని రమేష్ ప్రసాద్, నారాయణమూర్తి పేర్కొన్నారు. ఈ సినిమాను తాము చూశామని, ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిన సినిమా అని పరుచూరి, భారవి తెలిపారు. మూడే మూడు పాత్రలతో రెండు గంటలు కట్టి పడేసే ఒక అద్భుతం అని అన్నారు. ఇందులో ఉన్నది ఒకే పాట అయినప్పటికీ.. అదొక్కటి పది పాటల పెట్టని శ్రీలేఖ అన్నారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సావాల్లో ప్రదర్శితమైన ఈ చిత్రం మన తెలుగు సినిమాకు గర్వకారణం కానుంది అన్నారు.
ప్రగతి, విక్రమ్ శివల నటన, శ్రీలేఖ సంగీతం, ఎం వి.రఘు ఛాయాగ్రహణం, రాజేష్ ఎడిటింగ్ ‘స్క్రీన్‌ప్లే’ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయని చెప్పారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.