గత కొన్ని రోజులుగా ఏ సినిమా విడుదలైన అందులో ఏదో ఒక సన్నివేశమో.. లేదా సినిమాలోని ఒక క్యారెక్టర్ పేరో..లేక సినిమా కాన్సెప్టో మా మనోభాలని దెబ్బతీసే విధంగా ఉందంటూ కంప్లైంట్స్ ఎక్కువవుతున్నాయి. ఈ మనోభావాలు దెబ్బతినడం కేవలం సినిమా వల్లనే ఎందుకవుతుందో వారికే తెలియాలి. ప్రస్తుతం మరోసారి మనోభావాల గొడవ చర్చకి వచ్చింది. నితిన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న భీష్మ టైటిల్ పై అభ్యంతరాలున్నాయని అంటున్నారు.
మహాభారతానికి మూలపురుషుడైన భీష్ముడి పేరును ఒక కమర్షియల్ సినిమాకి ఎలా పెడతారంటూ వాదిస్తున్నారు. అంతే కాదు భీష్మ అనే పేరు పెట్టి హీరో వెకిలి వేషాలు వేయడం ఏంటని వాపోతున్నారు. అసలు సినిమాలో విషయం ఏముందో తెలియక ఇలా వారి ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడుకుంటారని చిత్ర బృందం ఆరోపిస్తుంది. భీష్మ పేరు పెట్టడం వల్ల భీష్ముడిని తక్కువ చేసినట్టు కాదని, తక్కువ చేసినట్టు అయితే సినిమాకి పేరెందుకు పెట్టుకుంటాం అని చెప్తున్నారు.
మరి వీరిరువురి వాదనలో ఎవరు గెలుస్తారో చూడాలి. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన వాల్మీకి సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది. సినిమా చూడకుండానే వాల్మీకి మహర్షి ని తక్కువ చేసి చూపుతున్నారంటూ ఆందోళన చేయడంతో సినిమా విడుదలకి ఒకరోజు ముందు పేరు మార్చాల్సి వచ్చింది. అయితే సినిమా విడుదల అయ్యాక వాల్మీకి పేరు కరెక్టుగా సరిపోతుందని చాలా మంది భావించారు.
మరి భీష్మ విషయంలోనైనా సినిమా చూసిన తర్వాత ఇలాంటి వివాదాలు చేసినా ఒక అర్థం ఉంటుందని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.