మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. అంత బిజీ షెడ్యూల్ లోనూ నేడు ఒక సరికొత్త అప్డేట్ తో మన ముందుకి వచ్చాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అవబోతున్నాడన్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం, సుకుమార్ రైటింగ్స్ రెండూ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బుచ్చిబాబు సానా అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ సినిమాలో విలన్ గా కనిపిస్తున్నాడు. తీర ప్రాంతాల్లో ఉండే జాలర్ల నేపథ్యంలో ఈ కథ ఉంటుందట. వైష్ణవ్ తేజ్ ఒక జాలరి కొడుకుగా కనిపిస్తాడని సమాచారం. హీరోయిన్ గా కృతి అనే కొత్త అమ్మాయిని తీసుకున్నారు. ఏప్రిల్ 2వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రం నుండి రామ్ చరణ్ తో నేడు ఒక పోస్టర్ ని రిలీజ్ చేయించారు. ఇప్పటి వరకు రిలీజైన అన్ని పోస్టర్ల కంటే ఈ పోస్టర్ చాలా ప్రత్యేకంగా ఉంది.
ఈ పోస్టర్ ని చూస్తుంటే సినిమాలో మంచి ప్రేమ కథ ఉందని అర్థం అవుతుంది. అమ్మాయి వెంటపడే అబ్బాయి పాత్రలాగా వైష్ణవ్ తేజ్ ఉన్నట్టు కనిపిస్తున్నాడు. తన వెంట పడుతున్నది తెలిసి కూడా కావాలని తిప్పించుకునే అమ్మాయిలాగా కృతి కనిపిస్తుంది. మొత్తానికి ఈ అందమైన ప్రేమ కథకి విజయ్ సేతుపతి ఏ విధంగా విలన్ అయ్యాడనేది చాలా ఆసక్తిగా ఉంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.