ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రతిష్ఠాత్మక చిత్రం
ఇది 2020లోనే అతిపెద్ద న్యూస్. ప్రభాస్ హీరోగా ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ ఒక సినిమాని డైరెక్ట్ చేయనున్నారు. ఈ ఆసక్తికర కాంబినేషన్ ను సాధ్యం చేసిన సంస్థ వైజయంతీ మూవీస్. నాగ్ అశ్విన్ వినిపించిన కథ బాగా నచ్చి, ఆయన దర్శకత్వంలో సినిమా చెయ్యడానికి ప్రభాస్ అంగీకరించారు. ఇప్పటి వరకూ చేయని తరహా పాత్రలో, ఒక కొత్త జానర్ లో ప్రభాస్ ను నాగ్ అశ్విన్ చూపించనున్నారు. తెలుగు చిత్రసీమలోని టాప్ ప్రొడక్షన్ కంపెనీల్లో ఒకటైన వైజయంతీ మూవీస్ ను సుప్రసిద్ధ నిర్మాత సి. అశ్వినీదత్ 49 ఏళ్ల క్రితం ప్రారంభించారు. ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలను, భారీ ప్రతిష్ఠాత్మక సినిమాలను అందించిన ఘనత ఆ బ్యానర్ సొంతం.
అలాంటి బ్యానర్ 50వ ఏట అడుగుపెడుతున్న సందర్భంలో ప్రేక్షకులకు ఒక మరపురాని చిత్రాన్ని అందించేందుకు సంకల్పించింది. 2018లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఆ సంస్థ నిర్మించిన ‘మహానటి’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా, మూడు జాతీయ అవార్డుల్ని సైతం పొంది దేశవ్యాప్తంగా కీర్తిని సంపాదించింది. ప్రభాస్, నాగ్ అశ్విన్ క్రేజీ కాంబినేషన్ మూవీని త్వరలోనే వైజయంతీ మూవీస్ సంస్థ ప్రారంభించనున్నది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.