టాలీవుడ్ సీనియర్ నటి, కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి అలియాస్ రాములమ్మ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో విజయశాంతి మళ్లీ మేకప్ వేసుకోన్నారు. మహేశ్ సినిమాలో రాములక్క కీలక పాత్రలో కనిపించి తనలో నటన.. అందం, ఐశ్వర్యం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్న సంగతి తెలిసిందే.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 13 ఏళ్ల తర్వాత సినిమాల్లో నటించనప్పటికీ తనలోని నటన ఎక్కడికీ పోలేదు.. రీ ఎంట్రీతో నిరూపించుకుంది. అంతేకాదు మళ్లీ క్రీజ్‌లోకి వచ్చేశానండోయ్ ఇక చూస్కోండి అంటూ ఒకింత సీనియర్ నటీనటులు, ఆంటీ పాత్రల్లో నటిస్తున్న వారికి ఒకింత హెచ్చరించినట్లయ్యింది. అయితే.. ఒకే ఒక్క సినిమాలో మాత్రమే నటించిన రాములక్క ఇక సినిమాల్లో నటించనని.. ఇప్పటికిక సెలవని సడన్ షాకిచ్చింది. దీంతో ఆమె అభిమానులంతా నిరాశ నిస్పృహలకు గురయ్యారు.
ఇదిలా ఉంటే.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అనీల్ రావిపూడి.. రాములమ్మ గురించి ఓ ఆసక్తికర పోస్ట్ చేశాడు. ‘మీతో కలిసి పని చేయడం చిరకాలం గుర్తుండిపోయే ఓ అనుభవం విజయ శాంతి మేడమ్. చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై మీరు రీ ఎంట్రీ ఇచ్చిన సినిమాకు నేను దర్శకత్వం వహించే అవకాశం రావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మీరు నటించిన తీరు నటనా నైపుణ్యాలు శాశత్వం అని నిరూపించింది’ అని అనీల్ ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. ఈ ట్వీట్‌తో పాటు విజయశాంతితో సరిలేరు టైమ్‌లో దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు.
కాగా.. అటు అనిల్ అభిమానులు.. ఇటు రాములమ్మ అభిమానులు.. మహేశ్ అభిమానులు కూడా ఈ ట్వీట్‌పై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. మొత్తానికి చూస్తే రాములమ్మ రెండో సినిమాలు తీసుకోవడానికే అనిల్ ఇలా ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారని వార్తలు కూడా గుప్పుమంటున్నాయ్. మరి ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.