చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటి వరకు వ్యాక్సిన కనుగొనబడని ఈ వ్యాధి గురించి ప్రతీ ఒక్కరిలో భయం ఉన్నమాట నిజమే. సుమారు రెండు వేల మంది కరోనా బారిన పడి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. చైనాకి రాకపోకలు బంద్ అయ్యాయి. జంతువుల నుండి మనుషులకి అంటుకున్న ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనుగొనడానికి శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషిచేస్తున్నారు.
ఇప్పటి వరకు 49 దేశాలకి విస్తరించిన ఈ వైరస్ కేరళలో మొట్టమొదటి కేసు నమోదయి భారత్ ని కూడా చేరుకుంది. అయితే తాజాగా ఈ వైరస్ హైదరాబాద్ ని కూడా తాకింది. 24 ఏళ్ళ సాఫ్ట్ వేరే ఉద్యోగి ఒంట్లో కరోనా ఉందని గాంధీ ఆస్పత్రి బృందం నిర్ణయించింది. చైనా నుండి భారత్ కి వచ్చిందని తెలియగానే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆస్పత్రిలో కరోనా డయాగ్నసిస్ కిట్లని ఏర్పాటు చేసింది.
సుమారు 2000 మంది ప్రాణాలు బలి తీసుకున్న కరోనా మన ఇంటికి వచ్చిందంటే ఎవ్వరైనా భయపడతారు. మన ఇంటికి ముందుకి వచ్చిన దాన్ని ఇంట్లోకి రాకుండా చూడడానికి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ కొందరు సెలెబ్రిటీలు కరోనాని కామెడీగా తీసుకుంటున్నారు. తాజాగా ఛార్మి చేసిన చర్యే దీనికి ఉదాహరణ. కరోనా కేసు హైదరాబాదులో నమోదయిందని తెలియగానే.. అదేదో అద్భుతం మన దగ్గరికి వచ్చినట్టు కంగ్రాట్స్ హైదరాబాద్ అంటూ ట్వీట్ చేసి వార్తల్లో నిలిచింది.
ఛార్మి ఏ ఉద్దేశ్యంతో అలా ట్వీట్ చేసిందో గానీ నెటిజన్లు మాత్రం తెగ తిడుతున్నారు. పక్కనోడు చచ్చిపోతుంటే వాడి ముందు నిల్చుని బాగా అయిందా అని సంబరపడి పైశాచికానందాన్ని పొందే వ్యక్తిలాగా ఆమె ట్వీట్ ఉందంటూ చీవాట్లు పెడుతున్నారు. దాంతో స్పందించిన ఛార్మి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకుంటున్నానని, అలా స్పందించడం కరెక్ట్ కాదని ట్వీట్ చేసింది.