ప్రతి ఏటా ఇండియాలో వందలాది సినిమాలు విడుదలవుతుంటాయి. వాటిలో ఒకటో రెండో బాక్సాఫీస్ దగ్గర అదివరకటి రికార్డుల్ని తిరగరాస్తుంటాయి. అలా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన టాప్ 10 సినిమాల్లో 3 సినిమాలు మన టాలీవుడ్ హీరోవే కావడం మనకు గర్వకారణం. ఆ హీరో ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయుంటుంది కదా అతను.. నన్ అదర్ ద్యాన్ ప్రభాస్. అతను టైటిల్ రోల్స్ పోషించిన ‘బాహుబలి’, ‘బాహుబలి 2’ సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి వసూళ్ల వర్షాన్ని కురిపించి, రికార్డుల్ని సృష్టిస్తే, ‘సాహో’ మూవీ సైతం టప్ 10 ఇండియన్ గ్రాసర్స్‌లో చోటు సంపాదించింది. ఇప్పటిదాకా మరే ఇతర దక్షిణాది హీరోకూ ఇది సాధ్యం కాలేదు. ప్రస్తుతం దేశంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ కూడా అతనొక్కడే కావడం ఇంకో విశేషం. అతనిపై అభిమానం ఎల్లలు దాటి, రాజస్థాన్, బిహార్ వంటి రాష్ట్రాల్లోనూ వేళ్లూనుకుంది.
1. బాహుబలి: ద కన్‌క్లూజన్ (రూ. 1115.86 కోట్లు) - రెండు భాగాల సినిమాల్లో ఈ రెండోదాని కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. కారణం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలని అమరేంద్ర బాహుబలిని చంపడానికి కారకుడైన భల్లాలదేవాపై బాహుబలి భార్య దేవసేన తన కుమారుడు మహేంద్ర ద్వారా ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఈ చిత్రంలోని ప్రధానాంశం. 2017లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికీ దేశంలోని ప్రేక్షకులకు ఆల్ టైం ఫేవరేట్. అదివరకటి అన్ని రికార్డుల్నీ బ్రేక్ చేసి దేశంలో నంబర్ వన్ గ్రాసర్‌గా నిలిచింది ఈ చిత్రం.
2. బాహుబలి: ద బిగినింగ్ (రూ. 418.54 కోట్లు) - యస్.యస్. రాజమౌళి సినిమాగా విడుదలైన ‘బాహుబలి’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ప్రభాస్‌ను దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆరాధ్య నటుడిగా మార్చిన తొలి సినిమాగా పేరు తెచ్చుకున్న ఇందులో చివరన ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే ప్రశ్నను మిగల్చడం క్యూరియాసిటీని పెంచేసింది. అందుకే ‘బాహుబలి’ని తెలుగు ప్రేక్షకులే కాకుండా హిందీ ప్రేక్షకులూ అమితంగా ఆదరించారు. అందుకే 2015లో రిలీజైన ఈ సినిమా ఇప్పటికీ టాప్ 2 గ్రాసర్‌గా నిలిచింది.
3. సాహో (రూ. 302.31 కోట్లు) - ఫ్రెష్ పెయిర్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ, మైండ్‌బ్లాక్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో సరైన కథ లేకపోయినా ‘సాహో’ సినిమాకు ఈ రేంజ్ కలెక్షన్లు అందించారు ప్రేక్షకులు. తెలుగులో ప్రి బిజినెస్ వ్యాల్యూ కంటే తక్కువ వసూలు చేసి బిలో యావరేజ్‌గా నిలిచిన ఈ మూవీ బాలీవుడ్‌లో మాత్రం లాభాల పంట పండించింది. పైగా ఇది ప్రభాస్ ఫస్ట్ స్ట్రెయిట్ బాలీవుడ్ ఫిల్మ్ కూడా. ఈ సినిమాతోటే ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ఎదిగిపోయాడనే వాస్తవం వెల్లడైంది. దేశవ్యాప్త కలెక్షన్లలో ప్రస్తుతం ‘సాహో’ది 9వ స్థానం.
ప్రభాస్ సినిమాల్ని పక్కనపెడితే, టాప్ 10 ఇండియన్ గ్రాసర్స్‌లో రజనీకాంత్ ‘2.0’ (రూ. 413.30 కోట్లు) మూడో స్థానంలో, అమీర్ ఖాన్ మూవీ ‘దంగల్’ (రూ. 387.29 కోట్లు) 4వ స్థానంలో, సల్మాన్ ఖాన్ సినిమా ‘టైగర్ జిందా హై’ (రూ. 339 కోట్లు) 5వ స్థానంలో, అమీర్ ఖాన్ చిత్రం ‘పీకే’ (రూ. 337.72 కోట్లు) 6వ స్థానంలో, రణ్‌బీర్ కపూర్ ఫిల్మ్ ‘సంజు’ (రూ. 334.58 కోట్లు) 7వ స్థానంలో, సల్మాన్ ఖాన్ సినిమా ‘బజ్‌రంగీ భాయిజాన్’ (రూ. 315.49 కోట్లు) 8వ స్థానంలో, సల్మాన్ ఖాన్ మరో మూవీ ‘సుల్తాన్’ (రూ.300.67 కోట్లు) 10వ స్థానంలో ఉన్నాయి.