తేనెలో ముంచి తీసిన బాదంపప్పు ఎంత రుచిగా ఉంటుందో, సిద్ శ్రీరామ్ పాడిన పాట అంతే కమ్మగా ఉంటుందని మరోసారి రుజువైపోయింది. పవన్ కల్యాణ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘వకీల్ సాబ్’ కోసం అతగాడు పాడిన ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా’ పాట సంచలనం రేపుతోంది. తమన్ సంగీత బాణీలు, రామజోగయ్య శాస్త్రి పదాలు కలిసిన ఆ పాటకు సిద్ శ్రీరామ్ గాత్రం తోడై ఇన్‌స్టెంట్ హిట్టయింది. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న విడుదల చేసిన ఈ పాట యూట్యూబ్‌లో నంబర్ 1గా ట్రెండ్ అవడం గొప్ప విషయం కాదు కానీ, ఆ పాటకు సిద్ జీవం పోసిన తీరే గొప్పగా ఉంది. లిరికల్‌గా చూస్తే ఆ పాటలో గొప్ప విశేషమేమీ లేదు. స్త్రీ గొప్పతనాన్ని ఇంతకంటే గొప్పగా చెప్పిన పాటలు మన సినిమాల్లో కోకొల్లలు. వాటితో పోలిస్తే ఈ పాటలో రామజోగయ్య శాస్త్రి చెప్పింది, రాసింది ఏమంత గొప్పగా లేదు.
ఏమాటకామాటే చెప్పుకోవాలి.. తమన్ బాణీలు మాత్రం బావున్నాయి. కానీ ‘మగువా మగువా’ అని పాట ఎత్తుకోవడంలోనే, ఆ గొంతు మన హృదయాల్ని తాకేసింది. అంత మార్దవం ఉన్న గొంతు, ఒక పాటకు తన గొంతుతో శిఖరమంత స్థాయిని చేర్చే గొంతు ఈ కాలంలో సిద్‌కు కాకుండా ఇంకెవరికీ లేదన్నంతగా అతడు పాడుతున్నాడు. లేదంటే ‘హుషారు’ లాంటి ఒక చిన్న సినిమాలో అతడు పాడిన ‘ఉండిపోరాదే’ పాట ఆ రేంజిలో హిట్టవడం సాధ్యమా? ఫ్లాపైన ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలోని ‘వెళ్లిపోమాకే’ పాట కానీ, ‘పడి పడి లేచె మనసు’ చిత్రంలోని ‘ఏమైపోయావే’ పాట కానీ ఇప్పటికీ అలా వినిపించడం, వాటిని మనం ఆస్వాదించడం సాధ్యమయ్యేదా? అల్లు శిరీష్ పాట అంటే మనకు గుర్తుకొచ్చేది ఏది? అతడి హిట్ సినిమాలోని పాటకంటే ఫ్లాపైన ‘ఏబీసీడీ’లోని ‘మెల్లగా మెల్లగా’ పాటే మనకు ఎక్కువ గుర్తుకొస్తుంది. అదీ సిద్ శ్రీరామ్ గొంతు మహత్యం.
అంతెందుకు.. విష్వక్ సేన్ అనే ఎవరికీ పెద్దగా తెలీని నటుడు ఇవాళ పాపులర్ యాక్టర్ కావడంలో ‘ఫలక్‌నుమా దాస్’ లోని ‘అరరే మనసా’ పాటే కదా తోడ్పడింది! సిద్ పాడితే ఆ పాటకు తిరుగుండదనేది రుజువైపోయింది. అందుకే ఇవాళ పెద్దా చిన్నా తేడా లేకుండా అతడి కోసం సంగీత దర్శకులు, దర్శకులు, నిర్మాతలు కాచుకొని కూర్చుంటున్నారు. లిరిక్ రైటర్స్ కూడా తమ పాటను అతడి నోట వినాలని తహతహలాడుతున్నారు. ఇవాళ సింగర్స్ వందలాది మంది ఉన్నా, సిద్ లాగా అతి స్వల్పకాలంలో ఇంత పేరు తెచ్చుకున్నవాళ్లు లేరు. అతడి లాగా డిమాండ్ తెచ్చుకున్నవాళ్లూ లేరు. ఇవాళ సిద్ ఒక ట్రూ సింగింగ్ సెన్సేషన్. తన పాటతో సంగీత ప్రపంచానికి కళ తీసుకు వచ్చిన నేటి తరం గాన గంధర్వుడు!