మెగాస్టార్ చిరంజీవి- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ సినిమాకు హీరోయిన్ కష్టాలు తప్పట్లేదు. చిరుకు సరిపోయే జోడి సెట్ అవ్వకపోవడం.. ఒకవేళ సెట్ అయినా అది మూడ్నాళ్ల ముచ్చట లాగా షూటింగ్ ప్రారంభానికి ముందే త్రిషలాగా షాకివ్వడం జరుగుతోంది. త్రిష తప్పుకున్నాక చిరు సరసన కాజల్‌ను తీసుకున్నారని ప్రచారం జరిగినప్పటికీ.. అదంతా ప్రచారమేనని తేలిపోయింది. అయితే.. గత నాలుగైదు రోజులుగా యోగా బ్యూటీ, టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్, స్వీటీ అనుష్కను దర్శకనిర్మాతలు సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు.. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కచ్చితంగా స్వీటీ ఒప్పుకుంటుందని పుకార్లు వచ్చాయ్.
అయితే.. తాజాగా ఓ అప్డేట్ వెలుగుచూసింది. స్వీటీ కూడా చిరకు షాకిచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ‘నిశ్శబ్దం’ తర్వాత చిరు సరసన నటిస్తుందని వార్తలు వచ్చిన్నప్పుటికీ అదంతా.. తూచ్ అని తాజాగా తేలిపోయింది. మెగాస్టార్ సరసన నటించడానికి అంతగా ఆసక్తి చూపట్లేదట. అందుకే చిరుకు షాకిచ్చి.. త్వరలోనే మరో లేడీ ఓరియెంటెడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. కాగా.. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రానుంది. యూవీ క్రియేషన్స్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ది అన్న సంగతి తెలిసిందే.
గతంలో.. ఇదే బ్యానర్‌లోనే ‘భాగమతి’ హిట్టవ్వడంతో అప్పట్లోనే మరో సినిమా అనుకున్నారట. అందులోనూ ప్రభాస్‌కు నో చెప్పలేక.. చిరు సినిమాను వదులుకుంటున్నట్లు త్వరలోనే ప్రకటించబోతోందట. అంటే ప్రభాస్ కోసం చిరు సినిమాను యోగా భామ కాదనుకుందట. కాగా ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెలువడనున్నాయట.