కొన్ని మనం అనుకుంటాం కానీ జరగవు. కొన్ని అనుకోం కానీ జరిగిపోతుంటాయి. మహేష్ కూడా దీనికి అతీతుడేమీ కాదు. మల్టీస్టారర్స్ చేయాలని అతనెప్పుడూ అనుకోలేదు. ‘మల్టీస్టారర్ చేస్తే గొడవలైపోతాయి. ఇక్కడ ఫ్యాన్స్ ఎక్కువ, ఫ్యాన్స్ అసోషియేషన్స్ ఎక్కువ. చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి’’ అని ఒకప్పుడు చెప్పిన మహేష్.. ఎట్టకేలకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాని వెంకటేష్ తో చేశాడు. అలాంటి సినిమా ఒకటి చేస్తానని అతడేమాత్రమూ ముందుగా ఊహించలేదు.
అలాగే లేటెస్ట్‌గా ‘ఆచార్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో నటించే చాన్స్ వచ్చినప్పుడు ఆయన కోసం ఆ సినిమా చేద్దామనుకున్నాడు. డేట్స్ కూడా ఎలాట్ చేశాడు. కానీ చివరకు చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి అతడికి ఝలక్ ఇచ్చారు. ‘‘తూచ్.. ఆ క్యారెక్టర్ నేనే చేయబోతున్నా మహేష్. ఏమీ అనుకోకు’’ అని చెప్పేశాడు చరణ్. ఇది కూడా మహేష్ కు అనూహ్యమే. చేస్తానని చెప్పినా అవతలివాళ్లు ఓకే చేయకపోవడం మహేష్ కెరీర్‌లో బహుశా ఇదే మొదటిసారేమో. ఈ అనుభవంతో అతడు మళ్లీ ఇలా ఏ హీరో సినిమాలోనూ స్పెషల్ రోల్‌కు ఒప్పుకోకపోవచ్చు.
మహేష్ చేయనని చెప్పిన విషయాలు ఇంకో రెండున్నాయి. వాటిలో ఒకటి, రీమేక్స్. ఒరిజినల్‌లో హీరో ఎలా చేశాడో అలాగే చేయాలి కాబట్టి, ఇంకొకరు చేసిన పాత్రను చేయడం తనకు ఇష్టం లేదని అతను చెప్పాడు. ఇప్పటివరకూ ఆ మాటను నిలబెట్టుకున్నాడు. భవిష్యత్తులోనూ నిలబెట్టుకుంటాడా? చెప్పలేం. ఇంకో విషయం.. బాలీవుడ్‌కు కానీ, హాలీవుడ్‌కు కానీ వెళ్లనని అతను పలుమార్లు కుండబద్దలు కొట్టినట్లు చెప్పాడు. ‘‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంటా. తెలుగు సినిమా స్థాయిని పెంచుతా’’ అని అతను ఇదివరకోసారి చెప్పాడు. కానీ ఆ పనిని అతడి కంటే ఎక్కువగా ప్రభాస్ చేశాడు. ‘బాహుబలి’ సినిమాకి ముందు మహేష్ తో పోలిస్తే చిన్న స్టార్ అయిన ప్రభాస్.. ఇవాళ ఏకైక పాన్ ఇండియా స్టార్ హోదాను అనుభవిస్తున్నాడు.
ప్రభాస్‌ను చూసి మహేష్ మనసు మారిందని అతని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఏదో ఒకరోజు బాలీవుడ్ సినిమాలో మహేష్ దర్శనమిస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనేది ఆ వర్గాల మాట. ఇప్పటికే బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్‌లో ఒకడైన సాజిద్ నదియడ్‌వాలా ఈ విషయమై మహేష్ తో చర్చించాడు కూడా. చూద్దాం.. రానున్న రోజుల్లో మహేష్ ఏం చేస్తాడో?