టాలీవుడ్ పవర్‌స్టార్.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో.. ఆయన కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్నారు. ఒకే ఒక్క సినిమా సార్ అని కొత్త డైరెక్టర్లు కోరుతుండగా.. ఇదివరకే పవన్‌తో సినిమా చేసిన దర్శకులు మాత్రం ఇంకోసారి చాన్స్ ఇచ్చి చూడండి సార్ అని అడుగుతున్నారు. ఇప్పటికే అలా.. హరీష్ శంకర్‌కు పవన్ అవకాశమివ్వడంతో.. ఇక మనకూ చాన్స్ ఇవ్వకపోతారా..? అని పవన్ కలిసే పనిలో నిమగ్నమయ్యారట. ఈ జాబితాలో ఇదివరకే పవన్‌తో ‘గోపాలా గోపాలా’, ‘కాటమరాయుడు’ చిత్రాల్ని తెరకెక్కించిన దర్శకుడు డాలీ కూడా ఉన్నారట.
మొదట.. ‘గోపాలా గోపాలా’ సీక్వెల్ చేద్దాం సార్ అని అడగ్గా పవన్ అంతగా ఆసక్తి చూపలేదట. దీంతో పవన్‌తో అయితే పక్కాగా సినిమా తీయాలి..? ఆయనేమో సీక్వెల్‌పై ఇంట్రెస్ట్‌గా లేరు.. ఏం చేయాలా..? అని ఆలోచించిన డాలీ.. ఇదివరకే సగానికిపైగా రాసుకున్న కథను జనసేనానికి వినిపించారట. సింగిల్‌లైన్‌కే పవన్ పడిపోయారట. వావ్ డాలీ అంటూ పవన్ తెగ సంబరపడిపోయాడట. రెండు నెలలు సమయమిస్తే కథ పూర్తి చేస్తాను సార్.. తర్వాత మీరు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే సినిమా అని పవన్‌తో డాలీ చెప్పాడట. అంతేకాదండోయ్ సినిమాలో పొలిటికల్ టచ్ కూడా ఉంటుందట. దీంతోనే జనసేనాని మురిసిపోయాడట. అయితే.. ఈ సినిమా వర్కవుట్ అయితే ఈ కాంబోలో ముచ్చటగా మూడోది వస్తోందన్న మాట. ఇటీవల జరిగిన వీరిద్దరి భేటీలో ఈ తతంగం అంతా జరిగిందట.
వాస్తవానికి.. ఇదివరకు డాలీ తెరకెక్కించిన రెండు సినిమాలు కూడా ఆశించనంతగా ఆడలేదు. దీంతో ఈసారి కథ మాత్రం అదిరిపోయేలా చేయాలని గట్టి ధీమాతో ఉన్నాడట. కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని ముందే పవన్‌కు మాట కూడా ఇచ్చాడట. మొత్తానికి చూస్తే పవన్ రీ ఎంట్రీ కోసం ఇన్నిరోజులుగా వేచి చూసిన దర్శకులంతా ఒక్కొక్కరుగా కథలు సిద్ధం చేసేసుకున్నారన్న మాట. మరి పవన్ రీ ఎంట్రీ సినిమా ‘వకీల్ సాబ్’ ఫలితం ఎలా ఉంటుందో అనే దానిపై మిగతా సినిమాలు ఆధారపడి ఉన్నాయన్న మాట. మరి పవన్‌కు ఇంకా ఎవరెవరు కథలు వినిపిస్తారో..? ఎవరెవరికి జనసేనాని గ్రీన్ సిగ్నల్ ఇస్తారో..? తెలియాలంటే ఇంకొన్నిరోజులు వేచి చూడక తప్పదు.