ప్రశాంతంగా ఉన్న మన జీవితాల్లోకి వచ్చి కరోనా సృష్టిస్తున్న కలకలం అంతా ఇంతా కాదు. ఆర్థికంగా పూర్తిగా కుదేలయిపోతున్నాం. ఉత్పత్తి ఆగిపోయి మార్కెట్ నిలిచిపోయి అనేక అవస్థలు పడుతున్నాం. ప్రపంచదేశాలంతా కరోనాని వదిలించుకోవడానికి తీవ్ర కష్టాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సమాజంలో పేరు మోసినవాళ్ళు, డబ్బున్నవాళ్ళు కరోనాని అడ్డుకోవడానికి ప్రభుత్వానికి తమవంతు సాయం చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలని నితిన్ ఇరవై లక్షల రూపాయలు ప్రకటించాడు. అలాగే తమిళ హీరోలు రజనీ, సూర్య, కార్తి సినీ కార్మికుల కోసం తమవంతు సాయం అందిస్తున్నారు. స్టార్ హీరో కమల్ హాసన్ ఇందుకు భిన్నంగా తన ఇంటినే విరాళంగా ఇచ్చేశాడు. చెన్నైలోని ఎల్డామ్స్ రోడ్ లో ఉన్న తన ఇంటిని తాత్కాలిక ఆసుపత్రిగా మార్చబోతున్నాడని సమాచారం. కరోనా బాధితుల కోసం హాస్పిటల్స్ ఎంతో అవసరం ఉన్న ఇలాంటి టైమ్ లో కమల్ హాసన్ తీసుకున్న నిర్ణయం ఎంతో మేలు చేయనుంది. ఇంకా ఇలాంటి వారు ముందుకు వస్తే కరోనా మహమ్మారిని మరింత తొందరగా తరిమి కొట్టొచ్చని అంటున్నారు.