కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ తీవ్ర అవస్థలకి గురి చేస్తోన్న ఈ సందర్భంలో ఒక్కో దేశం కరోనా నుండి బయటపడడానికి పెద్ద యుద్ధమే చేస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ చైనా కంటే ఎక్కువగా వేరే దేశాలని వణికిస్తోంది. కరోనా బారినుండి చైనా మెల్లమెల్లగా కోలుకుంటుంది. కానీ ఇటలీ, ఇరాన్ వంటి దేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని తమ పౌరుల ప్రాణాలని రక్షించలేకపోతున్నాయి.
కరోనా కారణంగా భారతదేశమంతటా ఏప్రిల్ 14వ తేది వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోతున్నారు. రాష్ట్రప్రభుత్వం కరోనాని తరిమికొట్టడానికి శక్తివంచన మేరకు ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో ప్రభుత్వానికి అండగా పలువురు సెలెబ్రిటీలు సాయం చేస్తున్నారు. మొన్న టాలీవుడ్ హీరో నితిన్ రెండు తెలుగు రాష్ట్రాలని ఇరవై లక్షల సాయం చేయగా, తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాలకి కోటి రూపాయల విరాళం అందించాడు.
ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించాడు.జనావళికి ఏ ఆపద వచ్చినా ముందుగా స్పందించే పవన్ కళ్యాణ్ కరోనాని అడ్డుకోవడానికి చేస్తున్న సమరంలో ఇచ్చిన ఈ విరాళం చాలా ప్రత్యేకమైనది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల భార్య అనుపమ నాదెళ్ళ తెలంగాణ ప్రభుత్వానికి రెండు కోట్ల చెక్కును అందజేసిన సంగతి తెలిసిందే.