నిరుపేద కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేసిన రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్
రోటీ కపడా ఔర్ మకాన్ అంటే... ఆహారం, దుస్తులు, తల దాచుకోవడానికి ఓ గూడు (ఇల్లు)... హాయిగా జీవితం సాగించడానికి మనుషులకు కావాల్సినవి. ఇల్లు, దుస్తులు ఉన్నప్పటికీ... కరోనా కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సరైన ఆహారం దొరకక కొంతమంది కష్టపడుతున్నారు. ముఖ్యంగా ఏ రోజుకు ఆ రోజు పని చేస్తే తప్ప ఇల్లు గడవని నిరుపేద కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద మనసుతో అటువంటి కళాకారులకు నిత్యావసర సరుకులు అందజేశారు. రెండొందల మందికి 10 కేజీల బియ్యం, 2 కేజీల కందిపప్పు, 2 కేజీల పంచదార, కేజీ ఉప్పు, అర కేజీ కారం, పావుకిలో టీ పొడి, 2 లీటర్ల ఆయిల్, 2 కేజీల ఆట, పావు కిలో పచ్చడి రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశారు. మరో రెండు వందల మందికి నిత్యావసరాలు అందజేయనున్నారు.
కరోనాపై పోరుకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ.10 లక్షల విరాళం
కరోనా వైరస్(కోవిడ్ 19) నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపడుతున్నాయి. టాలీవుడ్‌కి చెందిన పలువురు స్టార్స్ ఇప్పటికే తమ వంతు సాయంగా విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో రూ.5 లక్షలు చొప్పున విరాళం అందజేస్తానని ఆయన వెల్లడించారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందజేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు.
*కరోనా నివారణ చర్యలకు రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలకు ‘హారిక అండ్ హాసిని’ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం.
ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా మహమ్మారి వల్ల భయాందోళనలో ఉంది. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనటానికి ప్రభుత్వాలు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయి. ఈ సందర్భంగా కరోనా నివారణ చర్యలకు రెండు తెలుగురాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘హారిక అండ్ హాసిని’ అధినేత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) రూ. 20 లక్షలు విరాళం ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.10 లక్షలు, తెలంగాణా ప్రభుత్వానికి రూ.10 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు).
మైత్రీ మూవీ మేకర్స్
27 మార్చి, 2020
ప్రతి ఒక్కరికీ ఇది ఛాలెంజింగ్ టైమ్. కోవిడ్-19పై పోరాటంలో ఏ ఒక్కరూ ఉపేక్షించకూడని కాలం. ఈ సంక్షోభ కాలంలో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రభావవంతమైన చర్యలను ప్రశంసించకుండా ఉండలేం.
ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి మా వంతు భాగస్వామ్యం.. అది చిన్నదే కావచ్చు.. అందిస్తున్నాం. కరోనాపై పోరాటానికి మద్దతుగా రూ. 20 లక్షలు విరాళంగా అందజేస్తున్నాం. వీటిలో రూ. 10 లక్షలు తెలంగాణ ప్రభుత్వానికీ, రూ. 10 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికీ అందిస్తున్నాం.
ఆపత్సమయంలో ఎక్కువ కుటుంబాలకు సాయపడేందుకు మరింత మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. ఈ సంక్షోభాన్ని సమష్టిగా మనం అధిగమించగలం.
సామాజిక దూరాన్ని పాటిస్తూ, కరోనా మహమ్మారిపై జరిపే పోరాటంలో విజయం సాధిద్దాం. సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండండి.. ఇంట్లో ఉండండి.
మీ
నవీన్ యెర్నేని
వై. రవిశంకర్