కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో లేని పోని పుకార్లు వచ్చేస్తున్నాయ్. వాటిలో ముఖ్యంగా చికెన్, ఎగ్స్ తినడం వల్ల కరోనా వస్తుందనేది పెద్ద పుకారు. దీంతో జనాలు అస్సలు ముక్క ముట్టుకోవాలంటే బెంబేలెత్తిపోయారు. అంతేకాదు.. కోళ్ల ఫారమ్ ఉండేవాళ్లు, చికెన్ సెంటర్స్ ఫ్రీగా ఇచ్చేస్తాం తీసుకెళ్లండ్రా బాబోయ్ అన్నా.. చికెన్ తీసుకెళ్లడానికి జనాలు ముందుకు రాలేదు. మరోవైపు పౌల్ట్రీకి సంబంధించి టీవీల్లో, వార్తా పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చినప్పటికీ అపోహలు మాత్రం అస్సలు తొలగలేదు. మరోవైపు రోజురోజుకూ కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో జనాలు ఇళ్లలో నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు.
పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ పేరిట..
అయితే.. కరోనా నేపథ్యంలో కోళ్ల ఫారంలు పెట్టుకున్న వారు తీవ్రంగా నష్టపోయారు. డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ కోట్లల్లో నష్టపోవడం జరిగింది. దీనంతటికీ కారణం ఒకే ఒక్క పుకారు అంతే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చికెన్ వల్ల కరోనా రాదు ఇంకా అందులో ప్రొటీన్స్ ఉంటాయ్ గనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యమే. ఇలా కోళ్ల ఫారంల ద్వారా భారీగా నష్టపోయిన వారిలో టాలీవుడ్ కమెడియన్, నిర్మాత బండ్ల గణేశ్ కూడా ఉన్నాడు. ఇటు కమెడియన్‌గా.. అటు నిర్మాతగా.. మరోవైపు కోళ్ల ఫారంలతో పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ పేరిట గట్టిగానే సంపాదించేశాడు. అంతేకాదు ఇక మిగిలింది రాజకీయాలే అని దాన్ని కూడా టచ్ చేయగా.. గట్టిగా షాక్ కొట్టడంతో బ్యాక్ టూ మూవీస్ అని వచ్చేశాడు. అప్పట్నుంచి తన కోళ్ల ఫారమ్ బిజినెస్ మరింత పెంచుకున్నాడు.
కేసీఆర్ ఏం చెప్పారు!?
అయితే తాజాగా భారీ నష్టాలు వాటిల్లడంతో.. శుక్రవారం నాడు మీడియా ముందుకొచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చికెన్ విషయాన్ని ప్రస్తావించారు. ‘వాస్తవానికి చికెన్ తింటే కరోనా తగ్గుతుంది. చికెన్ అనేది ప్రొటీన్. రోగ నిరోధక శక్తి పెంచుతుంది. చికెన్, గుడ్లతో పాటు నిమ్మ, బత్తాయి, కమలా పండ్లు తినాలి. ఈ పండ్లలో విటమిన్ సీ ఉంటుంది’ అని కేసీఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో బండ్ల తెగ మురిసిపోయాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా స్పందించి ఆసక్తికర పోస్ట్ చేశాడు.
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..!
‘మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్’ బండ్ల గణేశ్ నమస్కారం అంటూ తెలంగాణ సీఎంఓ ను ట్యాగ్ చేస్తూ బండ్ల ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు సీఎం కేసీఆర్ ఫొటోను కూడా జత చేశాడు. ‘థ్యాంక్యూ సార్’ నమస్కారం అంటూ మరో పోస్ట్ చేసిన బండ్ల గణేశ్.. చికెన్ గురించి కేసీఆర్ మాట్లాడిన ఓ వీడియోను జతపరిచాడు. కాగా.. దీనిపై పెద్ద ఎత్తున కామెంట్స్ వర్షం కురుస్తున్నాయ్. మరీ ఇంత స్వార్థమైతే ఎలా గణేశా.. జనాల గురించి కూడా కాస్త ఆలోచించు అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి చూస్తే కేసీఆర్ ప్రకటనతో బండ్లకు రెక్కలొచ్చాయన్న మాట.