టాలీవుడ్‌లో టాప్ యాంకర్లలో ఒకరైన యాంకర్ ప్రదీప్ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..’ సినిమాతో హీరో అయిపోవాలని ఎన్నో కలలు కన్నాడు. అయితే.. ఆ కలలన్నీ కల్లలయ్యాయి. ఈ సినిమాపై ఆయన పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయాయి. కరోనా మహమ్మారి దెబ్బకు యావత్ ఇండియా లాక్ డౌన్ అయిన సంగతి తెలిసిందే. అయితే అన్నింటి కంటే ముందుగానే అలెర్టయిన టాలీవుడ్.. సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు ఆఖరికి థియేటర్స్ కూడా మూసేయడం జరిగింది. ఈ తరుణంలో ఈసారైనా హిట్ కొడదామనుకున్నా.. హీరోగా ఎంట్రీ ఇస్తున్నవారికి గట్టిగా గండి పడినట్లయ్యింది. అలాంటి వారిలో యాంకర్ ప్రదీప్ కూడా ఒక్కడు.
వాస్తవానికి ఈ సినిమాను మార్చి-25న థియేటర్లలోకి తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే.. కరోనా ప్రభావంతో ఆ పుణ్య కాలం కాస్త గడిచిపోయింది. అయితే.. ఏప్రిల్‌లో అయినా రిలీజ్ చేసుకుందామని భావిస్తున్నప్పటికీ.. వచ్చే నెల ఇంకా పరిస్థితులు ఘోరంగా ఉంటాయని థియేటర్లు కాదు కదా.. ఏప్రిల్ మొత్తం జనాలు ఇంటి నుంచి బయటికి రాలేరని త్వరలోనే మరోసారి లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని కొత్త పుకార్లు పుట్టుకొస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. ఏప్రిల్ మొత్తం కష్టమే.. ఇక పరిస్థితులు అనుకూలిస్తే.. మే నెలలో అయితే పెద్ద పెద్దోళ్లందరి సినిమాలు ఉన్నాయ్.. వారిని ఎదిరించి.. ఢీ కొట్టేంత పరిస్థితులు మాత్రం ప్రదీప్‌కు లేవనే చెప్పాలి. అంతేకాదండోయ్ థియేటర్లు దొరకడమే పెద్ద గగనం.
అంటే ప్రదీప్ ముందున్నది ఒకే ఒక్క ఛాన్స్ అంతే.. జూన్‌లో అయితే పెద్దగా సినిమాలుండవ్ గనుక అప్పుడైతే ఎంచక్కా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..’ యూత్‌గా నేర్పించేసుకోవచ్చు అన్న మాట. మొత్తానికి చూస్తే తొలి ప్రయత్నంతోనే ఏదో చేద్దాం.. హీరోగా నిలబడదామనుకున్న ప్రదీప్ ఆశలన్నీ ఆదిలోనే ఆవిరైపోయాయ్. మరి ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లలోకి తెస్తారో..? కరోనా నేపథ్యంలో జనాలు థియేటర్లలోకి ఏ మాత్రం ఆదరిస్తారో..? అనేది తెలియాలంటే ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా..’ థియేటర్లలోకి వచ్చినంత వరకూ వేచి చూడాల్సిందే.