సినీ ఇండస్ట్రీకి గానీ.. తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, దాసరి ముందుకొచ్చేవారు. మరి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య, అక్కినేని నాగార్జున ఉన్నారని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ చెప్పుకొచ్చారు. ఎప్పుడూ తన అభిప్రాయాలను ‘పరుచూరి పలుకులు’ అనే యూ ట్యూబ్ చానెల్ ద్వారా పంచుకునే ఆయన తాజాగా.. లాక్ డౌన్ కాలంలో చిత్ర పరిశ్రమకి చెందిన కార్మికుల వెతలు, వారిని ఆదుకోవడానికి ముందుకొచ్చి పెద్ద మనసు చాటుకున్న పెద్దల గురించి పరుచూరి మాట్లాడారు.
తెలుగు చలన చిత్రపరిశ్రమలో 20 వేలమంది కార్మికులు వున్నారని వారిలో నెల మొత్తం ఆదాయం లేకపోయినా బతికేవాళ్లు వెయ్యి మంది మాత్రమే ఉన్నారని.. మిగిలిన వారంతా కూలిపైనే ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. అప్పట్లో ఏవైనా సహాయ కార్యక్రమాలు చేయాలంటే ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, దాసరి ముందుకొచ్చేవారన్నారు. ఇప్పుడు కూడా అలాగే.. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ని ఏర్పాటు చేస్తూ చిరు ముందుకు రావడం చాలా మంచిపరిణామం అన్నారు. ఈ మంచి పనికి చిరంజీవి శ్రీరస్తు అంటే బాలకృష్ణ శుభమస్తు అనగా.. నాగార్జున వెంటనే స్పందించారు. ఆ తర్వాత ప్రభాస్, పవన్, మోహన్ బాబు, ఎన్టీఆర్ ఇలా చాలా మంది పెద్ద మనసు చాటుకున్నారని చెప్పారు. పెద్ద మనసు చేసుకుని కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా పరుచూరి ధన్యవాదాలు తెలిపారు.
కరోనాపై పోరాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుగా.. పలువురు క్రీడా, సినిమా, రాజకీయ ప్రముఖులు విరాళాలు అందిస్తున్నారు. టాలీవుడ్ విషయానికొస్తే.. షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లు లేక అష్టకష్టాలు పడుతున్న సినీ కార్మికులను.. మరోవైపు పేదలను ఆదుకునేందుకు తమవంతుగా నిత్యావసరాలు ఇంటింటికెళ్లి వ్యక్తిగతంగా.. ట్రస్ట్ తరఫున కూడా అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు పెద్ద మనసుతో సాయం చేశారు. చాలా మంది తమకు తోచినంత విరాళాలు ప్రకటించారు. మరీ ముఖ్యంగా మెగాస్టార్ మనసులోనుంచి పుట్టిన సీసీసీకి కూడా చాలా మంది విరాళాలు ప్రకటించారు.