అందాల తార సాయిపల్లవి గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు. మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ ఆ తర్వాత తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఫిదా’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మొదలు చాలా సినిమాల్లో నటించేసి మెప్పించింది. అలా తెలుగు రాష్ట్రాల యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. నాటి నుంచి నేటి వరకూ ఈ హైబ్రీడ్ పిల్లకు అవకాశాలకు కొదువే లేకుండా పోతోంది. అంతేకాదండోయ్ టైమ్ లేక సినిమాల్లో నటించలేకుందంటే ఏ రేంజ్‌లో అవకాశాలు వస్తున్నాయో అర్థం చేస్కోండి.
ఈ పాత్రే ఎక్కువగా ఇష్టం..
నటనకి మంచి స్కోప్ ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ.. సహజత్వానికి దగ్గరగా నటిస్తుండే ఈ భామ ఎక్స్‌పోజింగ్‌కు అస్సలు ఒప్పుకోదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అసలెందుకు ఎక్స్‌పోజింగ్ ఒప్పుకోదు..? ఎలాంటి పాత్రలో నటించడానికి ఎక్కువగా ఇష్టపడతారనే ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇందుకు ఈ భామ చాలా లాజికల్‌గా బదులిచ్చింది. తాను మొదట్నుంచి కూడా తెరపై ఒక సాధారణ కాలేజ్ అమ్మాయిలా కనిపించడానికే ఎక్కువగా ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా కురచ దుస్తులు వేసుకోవడం, అతిగా వయ్యారాలు ఒలకబోయడం అస్సలు ఇష్టముండదని మరోసారి స్పష్టం చేసింది. అంతేకాదు.. తాను ‘ఫిదా’ చిత్రంలో ఒకే ఒక్క సీన్‌లో కురచ డ్రెస్ వేసుకున్నానని సన్నివేశం డిమాండ్ చేసే సరికి అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
వదిలేస్తా అంతే..
కాగా.. ఇలానే మళ్లీ మళ్లీ ఏ సినిమాలో అయినా కనిపించాలంటే మాత్రం అస్సలు ఒప్పుకోనని తేల్చి చెప్పేసింది. తప్పదు.. తప్పకుండా అలా చేయాల్సిందేనని డిమాండ్ చేసినా.. ఒత్తిడి చేసినా ఇక ఆ సినిమా ఏ మాత్రం ఆలోచించకుండా వదిలేస్తానని చెప్పేసింది. అంతేకాదు ఇలా వదులుకున్న సినిమాలు చాలానే ఉన్నాయని కూడా సాయిపల్లవి చెప్పుకొచ్చింది. అంటే.. ఈ భామను హీరోయిన్‌గా తీసుకోవాలంటే ఈ కండిషన్ తెలుసుకుని సంప్రదించాలన్న మాట.