ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ముచ్చెమటలు పట్టిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు ఎవరికి.. ఎలా సోకుతుందో అర్థం కాని పరిస్థితి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎలా వచ్చి చేరుతుందో అది కూడా ఎలాంటి లక్షణాలు లేకుండా చేరటం అంతుచిక్కని విషయం. హాలీవుడ్ మొదలుకుని బాలీవుడ్ వరకూ సెలబ్రిటీలను కూడా ఈ మహమ్మారి పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఈ వైరస్ బారినపడి తిరిగిరానిలోకాలకు చేరుకోగా.. మరికొందరు చికిత్స తీసుకుంటున్నారు. ఇంకొందరైతే డిశ్చార్జ్ అయ్యి ఇంటికే పరిమితం అయ్యారు. ఇక బాలీవుడ్‌లోనూ కొందరికి వైరస్ సోకగా జయించి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవలే.. ప్రముఖ నటి పాయల్ ఘోష్‌కు కూడా కరోనా సోకిందని పుకార్లు వచ్చాయి.
మలేరియా అంతే..
మొదట ఆమె అనారోగ్యంతో చితికిపోవడం.. కరోనా లక్షణాలు కూడా ఉండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. ధైర్యం చేసి ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబీకులు ఎట్టకేలకు కరోనా టెస్ట్ చేయించారు. ఫలితం రావడానికి సుమారు నాలుగైదు గంటలు పట్టగా కుటుంబ సభ్యులు, ఆప్తులు, అభిమానుల్లో మరింతగా ఆందోళన పెరిగిపోయింది. చివరికి ‘నెగిటివ్’ అని తేలింది. అయితే జ్వరం మాత్రం మలేరియా ఉందని తేలడంతో కుటుంబ సభ్యులు హమ్మాయ్యా.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో తనకు ఫోన్ చేసి ఆందోళన పడ్డ ఆప్తుల కోసం సోషల్ మీడియా వేదికగా ఈ భామ క్లారిటీ ఇచ్చుకుంది.
ఆందోళన వద్దు..
‘నేను క్షేమంగానే ఉన్నాను. కరోనా నుంచి ప్రపంచం తిరిగి కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నాకు కరోనా లేదు.. మలేరియా జ్వరం అంతే. నేను త్వరగానే కోలుకుంటాను. అభిమానులెవ్వరూ ఆందోళన చెందకండి’ అని పాయల్ పేర్కొంది. దీంతో పుకార్లు, ఆందోళనకు చెక్ పడినట్లయ్యింది. ఈ భామ తెలుగు సినీ ప్రియులకు కూడా సుపరిచితురాలే. ‘ఊసరవెల్లి’, ‘ప్రయాణం’ సినిమాల్లో పాయల్ నటించి మెప్పించింది.