మెగాస్టార్ చిరంజీవి- హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతున్న విషయం విదితమే. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ టైమ్‌కల్లా సినిమా సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యేది.. కరోనా మహమ్మారి దెబ్బతో యావత్ ప్రపంచ వ్యాప్తంగా సినిమా షూటింగ్‌లు, రిలీజ్‌లు సర్వం బంద్ అయ్యాయి. ఈ దెబ్బ ‘ఆచార్య’పై కూడా గట్టిగానే పడింది. టాలీవుడ్‌లో అందరికంటే ముందుగా సినిమా షూట్‌ను వాయిదా వేసుకుంది ఈ చిత్ర యూనిటే. వాస్తవానికి ఈ సినిమాను ఆగస్ట్-14న అనగా.. స్వాత్రంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ఫిక్స్ అయ్యారు. అయితే ఇది ఇప్పట్లో జరగని పని. దీంతో తాజాగా నిశితంగా లెక్కలేసి మరీ ఓ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నారట.
ఎవరూ అడ్డురాకండి!
అదేమిటంటే.. ‘ఆచార్య’గా చిరు రావాలనుకున్న టైమ్‌కు తమ్ముడు పవన్ ‘వకీల్ సాబ్’గా రావాలని నిర్ణయించాడట. అయితే అన్నయ్య మాత్రం సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట. ఇటీవలే దర్శకనిర్మాతలంతా ఫోన్‌లో షూటింగ్‌తో పాటు రిలీజ్ డేట్‌లు, ప్రమోషన్స్ గురించి మాట్లాడుకున్నారట. ఫైనల్‌గా ఈ ఏడాది వద్దనుకుని వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకురావాలని ఫిక్స్ అయ్యారట. అంతేకాదు.. సినిమా రిలీజ్ అయ్యే టైమ్‌లో పెద్ద పెద్ద సినిమాలేమీ రిలీజ్ కాకుండా అంటే ఎవరూ అడ్డు రాకుండా చూస్కోవాలని అనుకున్నారట. ఒకవేళ అడ్డొచ్చినా కచ్చితంగా ఆ సినిమా కథ అక్కడితోనే ముగిసిపోతుంది.. ఇది పక్కాగా రాసిపెట్టుకోవాల్సిందే.
లెక్కలు ఇలా..!
ఇదే నిజమైతే మాత్రం సంక్రాంతి మొత్తం మెగాస్టార్‌దే అన్న మాట. వాస్తవానికి సంక్రాంతికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఉంటుందని ఇప్పటికే జక్కన్న క్లారిటీగా చెప్పాడు. కరోనా దెబ్బతో అది అస్సలు కుదరని పని. అందుకే ఆ డేట్స్‌ను చిరు బుక్ చేసేసుకున్నారట. కరోనా భయం తొలగిన తర్వాత గట్టిగా 2 నుంచి మూడు నెలలు అయితే షూటింగ్ అయిపోతుంది. ఆ తర్వాత సాంగ్స్, ఇంకా ఫైట్ సీన్స్ పూర్తి చేస్తే ఇక పనంతా అయిపోయినట్లే. ఈ పనులు.. ఆ పనులు అన్నీ పూర్తయ్యే సరికి ఏ డిసెంబర్ అటు ఇటు అవుతుంది. ఆ తర్వాత ఇక ప్రమోషన్సే. మరి సంక్రాతికే వస్తాడా లేకుంటే అంతకుముందే ‘ఆచార్య’ వస్తాడా..? అనేదానిపై చిత్రబృందమే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.