లాక్డౌన్ కారణంగా థియేటర్లు మూసి ఉండడంతో జనాలు సినిమాలు చూడడానికి ఓటీటీలని ఆశ్రయిస్తున్నారు. గతంలో ఓటీటీని లైట్ తీసుకున్నవారు కూడా ఇప్పుడు చేసేదేమీ లేక వినోదం కోసం వాటినే ఆశ్రయిస్తున్నారు. తద్వారా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి సబ్ స్క్రయిబర్స్ రోజురోజుకీ పెరుగుతున్నారు. థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునేలా లేవు కాబట్టి ఓటీటీలకి మరింత డిమాండ్ పెరగడం ఖాయం.
అయితే ఓటీటీలకి డిమాండ్ పెరుగుతున్న మాట నిజమే అయినప్పటికీ, అక్కడ రిలీజైన కంటెంట్ పైరసీ రూపంలో వివిధ వెబ్ సైట్లలో దర్శనమిస్తుండడం ఓటీటీ యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మనోజ్ బాజ్ పాయి నటించిన మిసెస్ సీరియల్ కిల్లర్ ఇటీవల నెట్ ఫ్లిక్స్ లో రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ పైరసీ సైట్లలో ఉచితంగా లభిస్తుంది.
దీంతో నెట్ ఫ్లిక్స్ బాగా నష్టపోతుందట. ఓటీటీలో సూపర్ సక్సెస్ లో దూసుకుపోతున్న ఇలాంటి వెబ్ సిరీస్ లని పైరసీ చేయడం వల్ల నెట్ ఫ్లిక్స్ యాజమాన్యాన్ని బాగా కలవరపెడుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓటీటీ ఓనర్స్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో చూడాలి. భవిష్యత్తులో థియేటర్లలో సినిమాలు చూడడం కష్టమే అనే మాటలు వినిపిస్తున్న టైమ్ లో ఇలా పైరసీలు చేయడం స్టార్ట్ చేస్తే ఓటీటీలకి కూడా డిమాండ్ తగ్గిపోతుందనే వాదన వినిపిస్తోంది.