దగ్గరి వాళ్ళు వెళ్ళిపోవటం ఎవరికైనా తీరని లోటే. ఒక్కోసారి వారు మనతోనే ఉన్నారని అనిపిస్తుంది. కానీ కాలం ఎవరో గిల్లినట్టు వాళ్లు లేరన్న విషయాన్ని గుర్తుచేసి కన్నీళ్ళు తెప్పిస్తుంది. రంగస్థలం సినిమాలో కుమార్ బాబుని లేకుండా చేసి చిట్టిబాబుకి కన్నీళ్ళు మిగిల్చి అందరినీ కంటతడి పెట్టించిన సుకుమార్, ప్రస్తుతం ఇలాంటి బాధనే అనుభవిస్తున్నాడు. సుకుమార్ స్నేహితుడు ప్రసాద్ ఇటీవలే కాలం చేసాడు.
ప్రసాద్ సుకుమార్ స్నేహితుడే కాదు మేనేజర్ కూడా. సుకుమార్ సినిమా వ్యవహారాలన్నీ ప్రసాదే చూసుకునేవాడు. కానీ ఇప్పుడు ఆయన లేడు. దాంతో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లాడు. ఇన్నాళ్ళుగా తనవద్దే ఉండి, బావా బావా అని పిలిచిన ప్రసాద్ లేకపోవడం ఆయనకి తీరని బాధని మిగిల్చింది. నేడు ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా ప్రసాద్ ని గుర్తుచేసుకున్నాడు సుకుమార్. లాక్డౌన్ టైమ్ లో ఇంట్లోనే ఉన్న సుకుమార్ కి సడెన్ గా ప్రసాద్ కళ్లముందుకి వచ్చినట్టు అనిపించింది.
దాంతో కుశల ప్రశ్నలతో పాటు లాక్డౌన్ టైమ్ లో ఎటూ తిరగొద్దని జాగ్రత్తలు చెబుతుంటే, తనని ఇప్పుడు కరోనా కూడా ఏం చెయ్యదని, హ్యాపీగా తిరగొచ్చని బదులిచ్చాడు ప్రసాద్. అయితే ఇదంతా వట్టి కలే అని తేలడానికి ఎంతో టైమ్ పట్టలేదు. నేడు ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సుకుమార్ రాసిన ఈ లేఖ అందర్నీ కంటతడి పెట్టించింది.