కరోనా కారణంగా థియేటర్లన్నీ మూతబడిపోవడంతో షూటింగులు నిలిచిపోయాయి. దీంతో జనాలంతా వినోదం కోసం ఓటీటీల మీద పడ్డారు. లాక్డౌన్ కి ముందు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలని కూడా ఓటీటీలో విడుదల చేయాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఈ మేరకు డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ సినిమాలకి భారీ ఆఫర్లని ఇచ్చాయి కూడా. అలా భారీ ఆఫర్ అందుకున్న సినిమాల్లో నాని నటించిన వి కూడా ఒకటి.
నాని, సుధీర్ బాబు లు హీరోలుగా నటిస్తున్న వి చిత్రాన్ని ఇంద్రగంటి మోహనక్రిష్ణ దర్శకత్వం వహించారు. అదితీ రావ్ హైదరీ, నివేథా థామస్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ కి మంచి స్పందన వచ్చింది కూడా. అయితే ఈ సినిమాకి ఓటీటీ నుండి మంచి ఆఫరే వచ్చినప్పటికీ నిర్మాత దిల్ రాజు తిరస్కరించాడట.
ఇంద్రగంటి మోహనక్రిష్ణ మొదటిసారిగా తన దారిని వదిలి థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులకి మంచి అనుభూతిని కలిగిస్తుందట. ముఖ్యంగా క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుందట. అందువల్ల ఇలాంటి చిత్రాలని డైరెక్టుగా ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని ఆగిపోయారట. మరి అంత థ్రిల్ చేసే అంశాలున్న వి సినిమాని థియేటర్లో ఎప్పుడు చూస్తామో..!