మోహన్‌లాల్ నటించిన బ్లాక్‌బస్టర్ మలయాళం మూవీ ‘లూసిఫర్’ తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ కానున్నది. ‘సాహో’ డైరెక్టర్ సుజీత్‌కు ఈ సినిమా బాధ్యతలను చిరంజీవి అప్పగించారు. తాజా సమాచారం ప్రకారం దీని స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేసిన ఒరిజినల్ ‘లూసిఫర్’ రీమేక్ హక్కుల్ని రామ్‌చరణ్ కొనుగోలు చేశాడు. నిజానికి ఆ మూవీ తెలుగులో విడుదలైంది కూడా. కానీ ప్రేక్షకులు దానిని ఆదరించలేదు. అయినప్పటికీ ప్రధాన పాత్రను మోహన్‌లాల్ పోషించిన విధానం, మూవీని పృథ్వీరాజ్ డైరెక్ట్ చేసిన విధానం క్రిటిక్స్‌ను బాగా మెప్పించాయి. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ‘లూసిఫర్’. మోహన్‌లాల్ చేసిన రోల్ చిరంజీవికి తెగ నచ్చేసింది. అందుకే ఆ పాత్రను పోషించాలని ఆయన తహతహలాడుతున్నారు.
ఆడియెన్స్, ఫ్యాన్స్ సైతం ‘లూసిఫర్’ రీమేక్‌లో చిరంజీవిని చూడాలని కుతూహలం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా డైరెక్టర్ సుజీత్ రీమేక్ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేశాడని తెలియడంతో, త్వరలో రామ్‌చరణ్ ఈ సినిమాని అఫిషియల్‌గా ప్రకటిస్తాడని ఆశిస్తున్నారు. ఫిల్మ్‌నగర్‌లో జరుగుతున్న మరో ప్రచారం ప్రకారం ‘లూసిఫర్’ తర్వాత బాబీ (కె.ఎస్. రవీంద్ర) డైరెక్షన్‌లో సినిమా చేయాలని మెగాస్టార్ సంకల్పించారు. విశేషమేమంటే, సెట్స్‌పైనున్న ఆయన తాజా చిత్రం ‘ఆచార్య’ నుంచి తప్పుకున్న త్రిష.. ఈ మూవీలో హీరోయిన్‌గా నటించనున్నట్లు వినిపిస్తోంది.
‘వెంకీమామ’ డైరెక్టర్ బాబీ చెప్పిన స్క్రిప్ట్‌కు చిరంజీవి ఫిదా అయ్యారనీ, తప్పకుండా ఆ స్క్రిప్టుతో సినిమా చేద్దామని బాబీకి ఆయన హామీ ఇచ్చారనీ బలంగా వినిపిస్తోంది. ఇదివరకు ‘ఆచార్య’ డైరెక్టర్ కొరటాల శివకూ, త్రిషకూ మధ్య విభేదాలు తలెత్తాయనే విషయం తనకు తెలీదని చిరంజీవి చెప్పారు. ఆమె విషయంలో మెగాస్టార్ సాఫ్ట్ కార్నర్‌తో ఉన్నారనీ, అందుకే మే 4 ఆమె బర్త్‌డేకి ఆయన విషెస్ తెలిపారనీ ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే మణిరత్నం సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ కోసమే త్రిష ‘ఆచార్య’ మూవీని వదులుకుందనే విషయం ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికి చిరంజీవితో మరో సినిమాలో ఆమె నటించనున్నదనే విషయం ఆసక్తికరం.