లాక్డౌన్ టైమ్ లో ఆర్ ఆర్ ఆర్ గురించి జరుగుతున్నంత చర్చ మరే సినిమా గురించి జరగట్లేదెమో. లాక్డౌన్ మొదలయిన కొన్ని రోజులకే మోషన్ పొస్టర్ తో పాటు, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ ని రివీల్ చేసి అభిమానుల్లో ఆసక్తిని, అంచనాలని పెంచేశాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజుగా వచ్చిన రామ్ చరణ్ ఇంట్రో వీడియోకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
దాంతో అందరి చూపు ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పైనే పడింది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడన్న ఆసక్తి మొదలైంది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ ని పోలీస్ దుస్తుల్లో చూసి ఎన్నో ప్రశ్నలు రేకెత్తించిన రాజమౌళి, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ని ఏ విధంగా చూపిస్తాడన్న కుతూహలం రోజు రోజుకీ ఎక్కువైంది. అయితే రామ్ చరణ్ ఇంట్రో షాట్స్ ఇంతకుముందే తీసుకున్నందువల్ల లుక్ విడుదల చేయగలిగాం అనీ, ఎన్టీఆర్ ఇంట్రో షాట్స్ ఇంకా బ్యాలన్స్ ఉండడం వల్ల ఫస్ట్ లుక్ వచ్చే అవకాశమే లేదని పుకార్లు షికార్లు చేశాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం నిర్మాత డీవీవీ దానయ్య మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోపై వర్క్ జరుగుతుందట. ఎన్టీఆర్ పుట్టినరోజు కేవలం ఐదురోజులే ఉన్న నేపథ్యంలో సీరియస్ గా ఈ వీడియోపై పనులు జరుగుతున్నాయట. రాజమౌళి ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయాలనే చూస్తున్నాడట. దీంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు.