త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తమ హీరో మరోసారి నటించబోతున్నాడనే వార్త జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఆనందంలో ముంచెత్తింది. ఇది తారక్ 30వ చిత్రంగా రానుంది. ఇదివరలో ఆ ఇద్దరూ కలిసి చేసిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’ (2018) మూవీ తారక్ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఆ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే రెండో చిత్రాన్ని యన్.టి.ఆర్. ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ పోస్టర్, టైటిల్ లోగో ఈ నెల 20న వెల్లడి కానున్నాయి. ఆ రోజు తారక్ బర్త్‌డే అనే విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా ఈ నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ మేలో మొదలై, 2021 మేలో విడుదలవుతుందని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సోదర సంస్థ అయిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ గతంలో ట్వీట్ చేసిన విషయం ప్రస్తావనార్హం. కానీ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో నిర్మాణ పనులు వాయిదా పడ్డాయి. దీంతో ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశాలు లేవు. అది కూడా వాయిదాపడక తప్పదు.
ప్రస్తుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం’ సినిమా చేస్తున్నాడు. యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రధారులు. డీవీవీ దానయ్య రూపొందిస్తోన్న ఈ మూవీ 2021 జనవరి 8న విడుదల కావాల్సి ఉండగా, నిర్మాణ పనులు ఆలస్యం అవుతుండటంతో విడుదల మరోసారి వాయిదా పడింది. 2021 వేసవిలో ఆ సినిమా రిలీజ్ కావచ్చనేది ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో జరుగుతోన్న ప్రచారం.