తారక్ తో పాటు నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న మరో సెలెబ్రిటీ మంచు మనోజ్. పుట్టినరోజులు ఒక్కటైన వీరిద్దరూ ఎంత స్నేహంగా ఉంటారో, అంత అల్లరి కూడా చేస్తుంటారు. పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ ఇచ్చిన ఒకానొక ఇంటర్వ్యూలో తన ఫ్యూఛర్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం అతడి నుండి అహం బ్రహ్మస్మి అనే టైటిల్ తో పాన్ ఇండియా రేంజ్ లో సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమా మీద మనోజ్ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న మంచు మనోజ్, ఒకేసారి పాన్ ఇండియా రేంజ్ సినిమా అనగానే అందరూ ఆశ్చర్యంగా ఫీల్ అయ్యారు. అయితే ఈ సినిమా అందరి అంచనాలకి తగ్గట్టుగానే ఉంటుందట. ఈ ప్రాజెక్టు పట్ల చాలా సంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నాడు. మనోజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఒకానొక ఫైట్ సీక్వెన్స్ కోసం ఏకంగా ఆరుకోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారట.
పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా చేస్తున్న ఈ సినిమాలో ఈ ఫైట్ సీక్వెన్స్ హైలైట్ గా నిలవనుందట. 8 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం యాభైరోజుల పాటు షూటింగ్ చేయనున్నారట. దానికి మొత్తంగా 6కోట్ల వరకి ఖర్చు అవుతుందట.ఇప్పటి వరకూ తన సినిమాల్లో కనిపించని, కొత్త మనోజ్ ని చూస్తారని చెబుతున్నాడు. కరోనా వల్ల సినిమా బడ్జెట్ లు తగ్గించుకోవాలని చెబుతున్న తరుణంలో మనోజ్ చేస్తున్నది నిజంగా సాహసమనే చెప్పాలి.