అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు, ఆ తర్వాత అదే సినిమాని హీందీలో రీమేక్ చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. షాహిద్ కపూర్ హీరోగా నటించిన కబీర్ సింగ్ చిత్రానికి బాలీవుడ్ జనాలు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా షాహిద్ కెరీర్లోనే అత్యధికంగా వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది. హిందీలో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అందుకున్న సందీప్ తన తర్వాతి చిత్రం బాలీవుడ్ లోనే తెరకెక్కిస్తాడని అందరూ అనుకున్నారు.
అక్కడ అవకాశాలు కూడా బాగా వచ్చాయి. రణ్ బీర్ కపూర్ తో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో కానీ సందీప్ నెక్స్ట్ చిత్రం ఎక్కడ ఉంటుందనే విషయం ఇంకా క్లారిటీ లేదు. తాజాగా ఒక వార్త ఫిలిమ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. భీష్మ సినిమాని తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ సందీప్ దర్శకత్వంలో సినిమా తీయాలని భావిస్తోంది.
మళయాల చిత్రమైన అయ్యప్పనుం కోషియం రీమేక్ హక్కులని సొంతం చేసుకున్న సితార సంస్థ డైరెక్టర్ కోసం వెతుకుతోంది. సందీప్ అయితే ఆ సినిమాలో ఉండే ఇంటెన్సిటీని బాగా తెరకెక్కించగలడని భావిస్తోందట. ఒరిజినల్ సినిమా తీసి తానేంతో నిరూపించుకున్న సందీప్ సితార ఆఫర్ స్వీకరించి సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా లేదా అన్నది సందేహంగా ఉంది.