టాలీవుడ్ సినిమా షూటింగ్స్ పున: ప్రారంభంపై, సీఎం కేసీఆర్‌తో సినీ పెద్దలు భేటీ కావడంపై సీనియర్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య సంచలన వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం మొదలైన సంగతి తెలిసిందే. బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నిర్మాత, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సి. కళ్యాణ్ స్పందించారు. సినిమా రంగంలో విభేదాలు లేవని తామంతా ఒక్కటేనన్నారు. బాలయ్యను ఎవరూ అవమానించట్లేదన్నారు. ఎవరో అవమానించారని బాలయ్య అనడం కరెక్ట్ కాదన్నారు. చిత్రసీమలో బాలకృష్ణది ప్రత్యేక స్థానముందని ఆయనకు ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఇస్తామన్నారు.
>బాలయ్యను ఎవరొద్దన్నారు..!?
‘షూటింగ్స్ కోసం ఎవరి పలుకుబడి వారు ఉపయోగించారు. బాలయ్యను పిలవడానికి.. ఇదేం ఆర్టిస్ట్‌ల మీటింగ్ కాదు. బాలయ్య వస్తానంటే ఎవరైనా వద్దంటారా..? ఇష్టమొచ్చిన వాళ్లను పిలవాళ్లన్నదేమీ లేదు. నిన్నటి దాకా టాలీవుడ్‌ను దాసరి నారాయణ రావుగారు భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ఎవరైనా వచ్చి భుజాన వేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవిగారి ఫేస్ వ్యాల్యూ పనికొస్తుందని ఆయన్ను మేం అడిగాం. ఎవరన్నది ముఖ్యం కాదని తమకు పని కావాలన్నదే ముఖ్యమని కళ్యాణ్ ఒకింత కౌంటరిచ్చారు. అలాగే నాగార్జున గారు వచ్చారు. మీకు అవసరమైతే చెప్పండి నేను వస్తాను అని బాలకృష్ణగారు అన్నారు’ అని కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
>బాలయ్యకే కౌంటర్..
గత కొన్ని రోజులుగా చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలను తాను బాలకృష్ణ దృష్టికి తీసుకెళ్లానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసిన మీటింగ్‌కి బాలకృష్ణని పిలవాల్సిన బాధ్యత తమది కాదని మూవీ ఆర్టిస్ట్ అసిసోషియన్ (మా) దే అని కళ్యాణ్ చేతులు దులుపుకున్నారు. అంతేకాదు ‘మా’లో ఎలాంటి విబేధాల్లేవన్నారు. సినిమా పరిశ్రమకు మేలు చేసేవారికి వెనకే ఉంటామన్నారు. కాగా.. బాలయ్యకు సి. కళ్యాణ్ అత్యంత ఆప్తుడన్న విషయం తెలిసిందే. మరి కళ్యాణ్ వ్యాఖ్యలకు బాలయ్య రియాక్ట్ అవుతారా లేకుంటే మిన్నకుండిపోతారా అనేది వేచి చూడాలి. మొత్తానికి చూస్తే బాలయ్య మాత్రం అటు టాలీవుడ్‌లో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ హాట్ టాపిక్‌గా మారారు.