పిజ్జా సినిమా దర్శకుడయిన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన జిగర్తాండ 2014లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో విలన్ గా నటించిన బాబీ సింహాకి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు కూడా దక్కింది. సాంకేతికంగానూ, కథ పరంగానూ చాలా కొత్తగా చూపించిన కార్తిక్ సుబ్బరాజ్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. అయితే ఈ సినిమాని హరీష్ శంకర్ గద్దలకొండ గణేష్ గా తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ చిత్రం వరుణ్ లోని మాన్ యాంగిల్ ని ప్రేక్షకులకి పరిచయం చేసింది. దర్శకుడు హరీష్ శంకర్, ఒరిజినల్ చిత్రానికీ తెలుగు రీమేక్ కి చాలా మార్పులు చేశాడు. అయితే తాజాగా ఈ తమిళ చిత్రం హిందీలోకి వెళ్ళనుందని అంటున్నారు. 2014లోనే ఈ చిత్రం హిందీలో రీమేక్ అవనుందని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకూ పట్టాలెక్కలేదు. కానీ మరికొద్ది రోజుల్లో ఈ సినిమా స్టార్ట్ కానుందని అంటున్నారు.
ఈ రీమేక్ లో విలన్ గా అజయ్ దేవగణ్ నటించబోతున్నాడని టాక్. హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని నటింపజేయాలని చూస్తున్నారట. తమన్నా ఇప్పటి వరకూ కొన్ని హిందీ సినిమాల్లో నటించిన్నా రావాల్సినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. దాంతో మరో మారు హిందీ ప్రేక్షకులని అలరించడానికి జిగర్తాండ రీమేక్ ద్వారా సిద్ధం అవుతోందని అంటున్నారు. మరి ఈ రీమేక్ తోనైనా బాలీవుడ్ లో పాగా వేయగలదేమో చూడాలి.