కొంత కాలం క్రితం తమిళ అనువాద చిత్రాలు తెలుగు తెరపై సృష్టించిన అలజడిని ఇండస్ట్రీ పూర్తిగా మర్చిపోలేదు. రజనీకాంత్, కమలహాసన్ మొదట్నుంచీ తెలుగు హీరోల మాదిరిగానే ఆదరణ పొందుతూ రాగా, ఆ తర్వాత వారికి విక్రమ్, సూర్య, శింబు, సిద్ధార్థ్, విశాల్, కార్తీ, ధనుష్ వంటి హీరోలు తోడయ్యారు. దాంతో ఒక్కొక్కప్పుడు తెలుగు సినిమాలకే తగినన్ని థియేటర్లు లభించని స్థితి ఏర్పడింది. తెలుగు స్ట్రెయిట్ సినిమాను విడుదల చేసినట్లుగానే వాళ్ల సినిమాలను కూడా ఇక్కడ భారీ పబ్లిసిటీతో విడుదల చేస్తూ వచ్చారు.
ఒక విధంగా చెప్పాలంటే మన హీరోలకు వీళ్లు పక్కలో బల్లేల్లా తయారయ్యారు. ఓ వైపు మన యువ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడితే, మరోవైపు తమిళ యువ హీరోల సినిమాలు శరపరంపరలా దూసుకువచ్చి థియేటర్లను ఆక్రమించేవి. అంతేనా.. అవి ఆడుతున్న థియేటర్లు యువతరం ప్రేక్షకులతో కిటకిటలాడేవి. దాంతో సహజంగానే వాళ్ల చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది. ‘అపరిచితుడు’, ‘గజిని’, ‘పందెంకోడి’, ‘ప్రేమిస్తే’, ‘మన్మథ’, ‘ఆవారా’, ‘రఘువరన్ బీటెక్’, ‘తుపాకి’, ‘రెమో’, ‘అభిమన్యుడు’ తదితర అనువాద చిత్రాలు ప్రేక్షకుల ఆదరాన్ని బాగా పొందాయి. ఆ హీరోల్లో సిద్ధార్థ్ అయితే ఏకంగా టాలీవుడ్‌లోనే కొంత కాలం తిష్ఠవేశాడు.
ఇప్పుడు ఆ రోజులన్నీ మారిపోయాయి. ఇదివరికటిలా తమిళ హీరోల సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించలేకపోతున్నాయి. ఉదాహరణకు రజనీకాంత్ ‘పేట’, ‘దర్బార్’ సినిమాలు తమిళంలో బ్లాక్‌బస్టర్ కాగా, ఇక్కడ అంతంత మాత్రంగానే ఆడాయి. అజిత్ సినిమా ‘విశ్వాసం’ తమిళంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. కానీ తమిళంతో పాటు తెలుగులో విడుదల చెయ్యడానికి ఆ చిత్ర నిర్మాత ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్లు రాలేదు. చివరకు చాలా రోజుల తర్వాత విడుదల చేస్తే, మొదటి రోజే ఈ సినిమాకి ప్రేక్షకులు కరువయ్యారు.
కొంత కాలం ఎంతో ఆర్భాటంతో, ప్రచారంతో విడుదల చేసిన సూర్య సినిమాలు ‘ఎన్‌జీకే’, ‘బందోబస్త్’ తెలుగులో డిజాస్టర్ అయ్యాయి. ఇక సిద్ధార్థ్, శింబు వంటి హీరోల సినిమాలను తెలుగులో విడుదల చెయ్యడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇటీవల తెలుగు హీరోలా మారిపోయాడనిపించిన కార్తీ సినిమాలకు సైతం తెలుగులో డిమాండ్ తగ్గిపోయింది. ‘ఖైదీ’ హిట్‌తో మళ్లీ అతని ప్రాభవం మొదలవుతుందనుకుంటే, ‘దొంగ’ అట్టర్‌ఫ్లాపయింది. ధనుష్, విశాల్ ప్రాభవం తెలుగునాట కనిపించడం లేదు. ధనుష్ సినిమాలు ‘తూటా’, ‘లోకల్ బాయ్’ డిజాస్టర్స్ కాగా, విశాల్ సినిమాలు ‘అయోగ్య’, ‘యాక్షన్’ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించలేకపోయాయి.
దీనికి కారణం.. కొంత కాలంగా తెలుగులోనూ యువ హీరోల సంఖ్య బాగా పెరగడమే. దీంతో అరవ హీరోలు వెనుకబడిపోయారు. తెలుగునాట ఇదివరకటిలా వాళ్ల పప్పులు ఉడకడం లేదు.