బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ఎన్నో ఏళ్ల నుండి సినిమా పరిశ్రమలో కొనసాగుతున్నాడు. అయితే కబీర్ సింగ్ సినిమా వచ్చేంత వరకి షాహిద్ కి స్టార్ స్టేటస్ రాలేదనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అనేది బాక్సాఫీసు లెక్కల ద్వారానే కొలుస్తారు. ఆ లెక్కన చూస్తే అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ షాహిద్ కపూర్ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దాంతో మరో తెలుగు చిత్రమైన జెర్సీ సినిమాని కూడా హిందీలో రీమేక్ చేస్తున్నాడు.
తెలుగు జెర్సీ సినిమాకి దర్శకత్వం వహించిన గౌతమ్ తిన్ననూరి హిందీ రీమేక్ కి దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇప్పటికే సగభాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కరోనా లేకుంటే ఈ పాటికి షూటింగ్ పూర్తి చేసుకుని థియేటర్లలో సందడి చేసుండేది. ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో మిగతా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకోనుంది. ఈ సినిమా అనంతరం షాహిద్ కపూర్ మరో రీమేక్ ప్లాన్ చేస్తున్నాడు.
తమిళ నటుడు సూర్య నటించిన ఆకాశం నీహద్దురా చిత్రాన్ని హిందీలో రీమేక్ చేద్దామని భావిస్తున్నాడట. సుధ కొంగర దర్శకత్వం వహించిన ఆకాశం నీ హద్దురా టీజర్ ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. అంతే కాదు ఇది నిజజీవిత కథ కూడా. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా వల్ల ఆగిపోయింది. అయితే ఈ చిత్ర హిందీ రీమేక్ లో షాహిద్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.