‘డిస్కో రాజా’ అండ్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’.. వీక్ స్ర్కీన్‌ప్లేతో న్యూసెన్స్!
సినిమాలు చూసే ప్రేక్షకులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి - మెదడుతో చూసే రకం, రెండు - కళ్లతో చూసే రకం. నిర్మాతల అదృష్టం కొద్దీ రెండో రకానికి చెందినవాళ్లు అధిక సంఖ్యాకులుగా ఉంటున్నందు వల్ల కొన్ని బిగ్ సినిమాలు ఎంత సిల్లీగా ఉన్నా సొమ్ము చేసుకోగలుగుతున్నాయి. కొన్ని సినిమాలు బలమైన పాయింట్ ఉన్నప్పటికీ స్క్రీన్‌ప్లే ప్లాబ్లమ్‌తో ఫట్ మంటున్నాయి. కథలో మెయిన్ పాయింట్‌గా ఒక సీరియస్ సమస్యని సృష్టించి, దాని చుట్టూ సీన్లు నడిపి, చివర్లో సమస్య లేదూ పాడూ లేదు.. అంతా వొట్టిదేనని తేల్చెయ్యడం ప్రేక్షకుల్ని ఫూల్స్ చెయ్యడమే అవుతుంది. ఇది సెన్సిబుల్ డైరెక్టర్ చెయ్యదగ్గ పనికాదు.
ఈ పని చేసింది క్రాంతిమాధవ్. ఆ సినిమా - ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్లుప్తంగా కథ చెప్పుకుంటే - ఒక కార్పొరేట్ కంపెనీలో సుఖంగా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి, బుక్స్ రాయాలనే తన కోరికను నెరవేర్చుకోవాలనుకుంటాడు గౌతమ్ (విజయ్ దేవరకొండ). కానీ రాయడానికి అతడికి ఐడియాస్ తట్టవు. ఎందుకు తట్టవో అతనికీ తెలీదు, మనకూ తెలీదు. ఇంట్లో ఖాళీగా కూర్చొని, ఐపాడ్‌లో కార్టూన్ షోస్ చూసుకుంటూ, సిగరెట్లు తాగుతూ, బేర్ చెస్ట్‌తో తిరుగుతూ ఉంటాడు. తనతో సహజీవనం చేస్తున్న ప్రేయసి యామిని (రాశీ ఖన్నా) ఫీలింగ్స్‌ను ఏమాత్రం పట్టించుకోకుండా, ఆమెతో పని కానిచ్చేస్తుంటాడు. అతని యాటిట్యూడ్‌కు విసుగుచెందిన యామిని, అతడికి బ్రేకప్ చెబుతుంది. అప్పుడు మనవాడికి ఐడియాస్ వచ్చి ఒక నవల రాయడం మొదలు పెడతాడు. తనను తాను బొగ్గుగని కార్మికుడిగా ఒక కథనీ, పారిస్‌లో ఉద్యోగానికి వెళ్లే యువకునిగా ఇంకో కథనీ రాస్తాడు. ఈ రెండు కల్పిత కథలు అతని జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించాయి? యామినిని మళ్లీ కలుసుకున్నాడా? అనేది క్లైమాక్స్.
స్టార్టింగ్‌లోనే గౌతమ్ యాటిట్యూడ్ చూశాక మనకు అతడి పాత్రతో సానుభూతి కలగదు. యామిని బాధలో అర్థముందని అర్థమవుతుంది. కానీ పదే పదే ఏడ్చే ఆమె ధోరణి చూశాక ఆమె మీద సానుభూతి కలగడానికి బదులు చికాకు కలుగుతుంది. ఇక తను నవలలో సృష్టించిన పాత్రల్లోనూ గౌతమ్ ప్రవర్తనను మనం ఏమాత్రం మెచ్చుకోలేం. కథలో ప్రేక్షకుల ముందుంచిన సమస్య.. యామినితో అనుబంధాన్ని గౌతమ్ పునరుద్ధరించుకున్నాడా, లేదా? అనేదే. ఆ సమస్యను వదిలేసి, వేరే కథలను పట్టుకొని, వేరే క్యారెక్టరైజేషన్స్ సృష్టించి చూడండని ప్రేక్షకుల మీదకు వదిలేస్తే.. చూడ్డానికి ఏముంటుంది.. చివర్లో ప్రేక్షకులు వెర్రిపువ్వులవడం తప్పితే! గౌతమ్ చేత ప్రధాన కథకు అదనంగా రెండు అబద్ధపు కథలను డైరెక్టర్ క్రాంతిమాధవ్ సృష్టించాడు. అవి అబద్ధపు కథలని మనకు అర్థమైపోయినప్పుడు స్క్రీన్‌ప్లే కూడా అబద్ధమైపోదూ.. తెలివైన దర్శకుడు చేయదగ్గ పని కాదిది.
ఇక రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ సంగతి.. వాసు (రవితేజ) చాలా రోజులుగా కనిపించకుండా పోతాడు. అప్పిచ్చిన ఫైనాన్షియరే అతడిని కిడ్నాప్ చేశాడని వాసు ఫ్యామిలీ మెంబర్స్ భావిస్తారు. ఇంకోచోట ఒక సైన్స్ ల్యాబ్‌లో ఒక డెడ్ బాడీపై ప్రయోగాలు జరుగుతాయి. ఆ డెడ్ బాడీకి సైంటిస్టులు ప్రాణం పోస్తారు. అతడిని చూసి వాసు కనిపించాడని తెలిసినవాడు అనుకుంటాడు. కాదనీ, 30 ఏళ్లుగా మంచులో గడ్డకట్టుకుపోయిన ఒక శవానికి ప్రాణం పోశామని సైంటిస్టులు చెబుతారు. ఆ వ్యక్తి పేరు డిస్కో రాజా అని తెలుస్తుంది. 30 ఏళ్ల క్రితం అతనెందుకు చనిపోయాడు? అతనికీ, వాసుకీ మధ్య ఉన్న కనెక్షన్ ఏమిటి? అనేది మిగతా కథ.
ఈ సైన్స్ ఫిక్షన్ కథను రొటీన్ ఫార్మాట్‌లో కాకుండా కొంత డిఫరెంట్‌గా చూపించాలనుకున్నాడు డైరెక్టర్ వి.ఐ. ఆనంద్. కానీ సెకండాఫ్‌లో ‘డిస్కో రాజా’ స్టోరీని అతను నడిపిన విధానంతో కథలో ఆసక్తి క్రమేపీ సన్నగిల్లుతూ వచ్చింది. రవితేజ డ్యూయెల్ రోల్ మధ్య సస్పెన్స్ లేకపోవడం కూడా సినిమాని దెబ్బతీసింది. డిస్కో రాజా కథను ఫ్లాష్‌బ్యాక్‌లో కాకుండా లీనియర్‌గా చూపించినట్లయితే వాసు, డిస్కో రాజా పాత్రల మధ్య చివరి దాకా సస్పెన్స్ మెయిన్‌టైన్ చేయవచ్చు. మిస్టేకెన్ ఐడెంటిటీతో కథను నడిపించి, ఎండ్ సస్పెన్స్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకోవచ్చు. మంచి ప్రత్యామ్నాయాలున్న ‘డిస్కో రాజా’ స్టోరీ లైన్ స్క్రీన్‌ప్లే లోపంలో ఇరుక్కుని పాడైపోయింది.
ఒడుపు తెలిస్తే సినిమా కథ సృష్టించడం బ్రహ్మవిద్యేమీ కాదు. నిజాయితీగా రెండు ప్లాట్ పాయింట్లు, రెండ్ పించ్‌లు, ఒక మిడ్ పాయింట్ కనిపెట్టగలిగితే, స్టోరీ దానికదే నాచురల్‌గా నడుస్తుంది.