మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సామాజిక సందేశాన్నిచ్చే కథాంశాలని ఎంచుకునే కొరటాల శివ, ఆచార్య సినిమాతో సందేశాన్ని మిళితం చేస్తూ ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అయితే ఈ సినిమా అనంతరం మెగాస్టార్ మళయాల చిత్రమైన లూసిఫర్ ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.
మళయాలంలో సూపర్ సక్సెస్ సాధించిన ఈ సినిమా తెలుగు రీమేక్ ని ఫ్లాప్ డైరెక్టర్ సుజిత్ కి అప్పగించారు. లూసిఫర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకి తగినట్లుగా సుజిత్, స్క్రిప్టులో చాలా మార్పులు చేసాడట. అయితే ఈ సినిమాలోని ఓ ప్రధాన పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి నటిస్తుందని వార్తలు వచ్చాయి. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమా ద్వారా మళ్లీ నటనలోకి వచ్చిన విజయశాంతి లూసిఫర్ లో నటిస్తుందని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే మళ్లీ విజయశాంతి కాదు సుహాసినీ నటించనుందని అన్నారు. తాజా సమాచారం ప్రకారం మరో సీనియర్ నటి పేరు వినిపిస్తుంది. తెలుగు తమిళ చిత్రాల్లో పాపులర్ హీరోయిన్ అయిన సీనియర్ నటి ఖుష్బూ లూసిఫర్ తెలుగు రీమేక్ లో మెగాస్టార్ సోదరిగా కనిపించనుందని అంటున్నారు. మరి ఈ విషయమై ఇప్పుడైనా చిత్రబృందం స్పందిస్తుందేమో చూడాలి.