నాని సినిమా వి విడుదల విషయంలో నెలకొన్న కన్ఫ్యూజన్ అందరికీ తెలిసిందే. కరోనా వల్ల రిలీజ్ వాయిదా పడిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ వార్తలు వస్తున్నాయి. నాని నటించిన ఈ సినిమాకి ఓటీటీ నుండి భారీ ఆఫర్ వచ్చిందనీ, చిత్ర నిర్మాత దిల్ రాజు ఓటీటీ గురించి ఆలోచిస్తున్నారని అంటున్నారు. అయితే అదంతా అటుంచితే ప్రస్తుతం నాని చేతిలో రెండు సినిమాలున్నాయి.
శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ చిత్రంతో పాటు రాహుల్ సాంక్రిత్యాయన్ దర్శకత్వంలో శ్యామ్ సింగరాయ్ సినిమాని చేస్తున్నాడు. శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి. కరోనాకి ముందు కొద్ది భాగం షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో చిత్రీకరణ స్టార్ట్ చేయనుందట.
అయితే ఈ రెండు సినిమాల అనంతరం నాని జెర్సీ దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ చిత్రం నాని కెరీర్లోనే గుర్తుండిపోయేదిగా నిలిచింది. సెన్సిబుల్ సినిమాతో ప్రేక్షకులకి మంచి అనుభూతిని అందించిన నాని, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి మరోసారి సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారట. మరికొద్ది రోజుల్లో ఈ విషయమై అధికారిక సమాచారం రానుందని చెబుతున్నారు.