కరోనా కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ ఉండదేమోనని అనుమానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ బిగ్ బాస్ సీజన్ 4 రాబోతుందని స్టార్ మా టీజర్ ని రిలీజ్ చేసింది. బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ కాబోతుందని తెలిసినప్పటి నుండి కంటెస్టెంట్లుగా ఎవరొస్తున్నారనే విషయం చాలా ఆసక్తిగా మారింది. కరోనా కారణంగా జూమ్ యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి కంటెస్టెంట్లని సెలెక్ట్ చేసారట.
అయితే ఈ సారి క్రేజీ స్టార్స్ హౌస్ లోకి రాబోతున్నారని సమాచారం. టెలివిజన్, సినిమా సెలెబ్రిటీలతో పాటు యూట్యూబ్ స్టార్లని కూడా హౌస్ లోకి తీసుకున్నారని అంటున్నారు. సినిమా సెలెబ్రిటీల్లో ఆర్ ఎక్స్ 100 హీరో కార్తికేయ గుమ్మకొండ పేరు ప్రముఖంగా వినిపించింది. అలాగే లవర్ బాయ్ ఇమేజ్ గల హీరో తరుణ్ కూడా హౌస్ లోకి వస్తున్నాడని అన్నారు. అయితే ఈ విషయమై తరుణ్ స్పందించాడు.
బిగ్ బాస్ హౌస్ లోకి తాను వెళ్తున్నానన్న మాటల్లో వాస్తవం లేదనీ, ఆ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో తనకి తెలియదనీ, బిగ్ బాస్ టీమ్ తనని సంప్రదించలేదని తెలిపాడు. అంతే కాదు బిగ్ బాస్ పై తనకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని తేల్చేసాడు. దీంతో తరుణ్ కంటెస్టెంట్ గా వస్తాడని వస్తున్న వార్తలన్నీ గాలివార్తలేనని స్పష్టం అవుతోంది.