సినిమా ఇండస్ట్రీలో విజయమే కీలకం. సక్సెస్ ఉంటేనే సర్వైవ్ అవ్వగలుగుతారు. అయితే గత కొన్ని రోజులుగా సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న వారిలో గోపీచంద్ ఒకరు. హీరో గోపీచంద్, ముందుగా విలన్ గా మంచి పేరు తెచ్చుకుని, ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యాడు. అయితే లౌక్యం తర్వాత గోపీచంద్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టాయి. దాంతో ప్రస్తుతం గోపీచంద్ కి హిట్టు చాలా అవసరం.
సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ చిత్రం చేస్తున్న గోపీచంద్, సీనియర్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో అలివేలు మంగ వెంకటరమణ అనే సినిమా చేయబోతున్నాడని తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైందని వార్తలు వచ్చాయి. పరిణతి చెందిన ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర ప్రముఖంగా ఉంటుందని వినబడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉంటుందని తెలిసింది.
హలో, చిత్రలహరి, రణరంగం సినిమాల్లో హీరోయిన్ గా కనిపించిన కళ్యాణి ప్రియదర్శన్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించనుందట. ఈ మేరకు అధికారిక సమాచారం రానప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే కీర్తి మెయిన్ రోల్ అయితే కళ్యాణి పాత్ర సెకండ్ హీరోయిన్ గా ఉంటుందట. కోవిడ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళనుంది.