హీరోల ఫ్యాన్స్ కి ఏ చిన్న అవకాశం దొరికినా వదలరు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు. మా హీరో సినిమా ట్రైలర్‌కి ఇన్ని లైక్స్ వచ్చాయి, అన్ని షేర్స్ వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో యుద్ధం చేస్తుంటారు. ఫ్యాన్స్ వార్‌లు ఒక్కోసారి హద్దులు మీరుతుంటాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి, మహేష్ ఫ్యాన్స్‌కి ఓ సిల్లీ యుద్ధం సోషల్ మీడియాలో రైజ్ అయ్యింది. తాజాగా ఓటీటీ ద్వారా విడుదలైన సత్యదేవ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలో ఎన్టీఆర్ ఫ్యాన్ - మహేష్ ఫ్యాన్‌కి మధ్య ఓ ఇంట్రెస్టింగ్ కామెడీ బిట్ ఉంది.
కమెడియన్ సుహాస్ ఎన్టీఆర్ ఫ్యాన్. మరో అమ్మాయి మహేష్ ఫ్యాన్. వాళ్లిద్దరూ.. నా హీరో గొప్పోడు అంటే నా హీరో గొప్పోడు అంటూ గొడవ పడుతుంటారు. అక్కడితో ఆగకుండా ఇద్దరు మరో హీరోపై సెటైర్లూ వేస్తారు. మహేష్ కదలకుండా నిలబడే కొడతాడు.. అంటూ ఓ పాత్ర అంటే, ఎన్టీఆర్.. పరిగెట్టించి, పరిగెట్టించి చంపుతాడు అని మరో పాత్ర అంటుంది. మహేష్ సినిమా చూసి, బాగోకపోతే.. ట్విట్టర్‌లో ట్రోల్ చేసేది మేమే అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్‌గా సుహాస్ అంటాడు. ఇది కేవలం కామెడీ కోసం ఈ ట్రాక్ రాసారు. కానీ మహేష్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం అది కామెడీ అనేది వదిలేసి.. సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ చేశారు. అసలు హీరోల విషయంలో ఫ్యాన్స్ ఎందుకంత డెలికేట్‌గా ఉంటారో కానీ.. ఏ చిన్న అవకాశాన్ని వదలరు.