వరుస విజయాలతో దూసుకుపోతున్న కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్, ఈ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ అంశాలని కలిగి ఉంటుందట. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
కరోనా కారణంగా ఆచార్య సినిమా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఒక్కసారి అన్నీ కుదురుకున్నాక మళ్లీ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా మెగాస్టార్ తర్వాతి చిత్రం గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి. లూసిఫర్ చిత్ర రీమేక్ హక్కులని కొనుక్కున మెగాస్టార్ తన తర్వాతి చిత్రంగా ఆ సినిమానే తీసుకువస్తున్నాడని అనుకున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ తర్వాతి చిత్ర విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుందట.
ఆగస్టు 22వ తేదీ మెగాస్టార్ పుట్టినరోజుని పురస్కరించుకుని నెక్స్ట్ సినిమాపై ప్రకటన వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగా ఆ సినిమా లూసిఫర్ రీమేక్ కాదని, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కొత్త సినిమాని ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తలు ఎంతమేరకు నిజమో తెలియాలంటే ఆగస్టు 22 వరకు వెయిట్ చేయాల్సిందే.